శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (08:31 IST)

ఏపీలో పర్యాటక బోటు కార్యకలాపాల పునరుద్ధణర

రాష్ట్రంలో పర్యాటక కార్యకలాపాలను త్వరితగతిన పునరుద్ధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్)వెల్లడించారు.

అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన పర్యాటక కార్యకలాపాలన్నిటినీ త్వరితగతిన పునరుద్ధరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ముఖ్యంగా వివిధ నదీప్రాంతాలు,రిజర్వాయర్లో బోటు కార్యకలాపాలను వెంటనే పునరుద్దరించేందుకు చర్యలు తీసుకున్నామని ఇప్పటికే 174 ప్రవేట్ బోట్లకు ధరఖాస్తులు రాగా ఇప్పటికే 60 బోట్లకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు.

విశాఖపట్నంతోపాటు తూర్పు గోదావరి జిల్లా దిండి,రాజమండ్రిల్లో ఇప్పటికే పర్యాటక బోట్లు ప్రారంభం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్రంలో 9చోట్ల కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వాటిద్వారా ఎప్పటికప్పుడు బోట్ల స్థితి,లైసెన్సులు వంటి కార్యకలాపాలను మానిటర్ చేయడం జరుగుతోందనని మంత్రి స్పష్టం చేశారు.
 
గోదావరి నదిలో పాపికొండలు ప్రాంతంలో జలవనరులుశాఖ ఆధ్వర్యంలో బ్యాధమేటికల్ విధానంలో నావిగేషన్ సర్వే చేయాల్సి ఉన్నందున పాపికొండలు మినహా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో త్వరితగతిన బోటింగ్ కార్యకలాపాలు మొదలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.

అదేవిధంగా సాగర సంగమం,అంతర్వేది,హంసలదీవిల్లో పర్యాటక బోట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.అంతేగాక కొల్లూరు,ఐలేరుల్లో కొత్తగా పర్యాటక పడవలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.
పిపిపి విధానంలో కొత్తగా పడవల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు.

రాష్ట్రంలో ప్రభుత్వ,ప్రవేట్ భాగస్వామ్యంతో కొత్తగా పర్యాటక పడవల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు.ఉభయగోదావరి జిల్లాల్లో అంతర్వేది నుండి నరసాపురం,కృష్ణా జిల్లాలోని హంసల దీవి,అలాగే నాగార్జున సాగర్, కడప జిల్లా బ్రహ్మంసాగర్,కర్నూల్ జిల్లా అవుకు,మంత్రాలయం ప్రాంతాల్లో పిపిపి విధానంలో కొత్తగా పడవలు కొనుగోలు చేసి నడపనున్నట్టు తెలిపారు.
 
విశాఖపట్నంలో ఓడ రెస్టారెంట్ ఏర్పాటుకు ప్రయత్నం
ఇటీవల తుఫాను ధాటికి బంగ్లాదేశ్ తీరం నుండి విశాఖ తీరానికి కొట్టుకవచ్చిన ఓడను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి అంగీకారం తెలిపారని మంత్రి పేర్కొన్నారు.దానిని ఓడ రెస్టారెంట్ గా మార్చి పర్యాటకలకు వింతైన అనుభూతిని కల్గించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు.
 
విజయవాడ,విశాఖకు కూడా సీప్లేన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి
విజయవాడతోపాటు విశాఖపట్నంలో కూడా సీప్లేన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.విజయవాడ నుండి హుస్సేన్ సాగర్ వరకూ సీప్లేన్ ను నిర్వహించాలని ప్రతిపాదించగా సుందర విశాఖనగరానికి కూడా ఈసౌకర్యాన్ని కల్పించేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
 
కరోనా సమయంలో పర్యాటకశాఖకు 22కోట్ల 50లక్షల రూ.లు ఆదాయం
రాష్ట్రంలో పర్యాటకశాఖ తరపున 37 బస్సులు,38రెస్టారెంట్లు(రిసార్స్టు)ఉండగా కరోనా కాలంలో 22కోట్ల 50లక్షల రూ.లు ఆదాయం సమకూరిందని మంత్రి పేర్కొన్నారు.

రానున్న కాలంలో పర్యాటకశాఖకు ఆదాయాన్ని మరింత పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో ప్రవేట్ రంగంలో ఐదు,ఏడు నక్షత్రాల హోటళ్లను ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో క్రీడలు,క్రీడాకారుల ప్రోత్సాహానికి పెద్దఎత్తున కృషి
రాష్ట్రంలో క్రీడలను,క్రీడాకారులను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనినాస్ వెల్లడించారు.గత ఏడాది ఉత్తమ ప్రతిభ కనపర్చి బంగారు,వెండి,రజత పధకాలు సాధించిన క్రీడాకారులకు 5లక్షలు, 3లక్షలు,2లక్షల రూ.లు వంతున 3కోట్ల రూ.ల నగదు ప్రోత్సాహకాలను అందించడం జరిగిందని తెలిపారు.

కోవిడ్ ను దృషిటిలో ఉంచుకుని 13 జిల్లాల్లో యువజన సర్వీసుల శాఖ ద్వారా యువత సర్వతోముఖాభి వృద్ధికి అనేక ఆన్లైన్ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.వాటిలో ముఖ్యంగా 1000 మందికిపైగా యువతకు యోగాలో శిక్షణ ఇవ్వడం,1000 మందికిపైగా ఆంగ్లబాషపై కమ్యునికేషన్ నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.అంతేగాక వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలను నిర్వహించామన్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో 2కోట్ల 2లక్షలతో చేపట్టిన స్టేడియం మరియు కోటి రూ.ల వ్యయంతో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్సును బుధవారం మంత్రి బాలినేని శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు.అదే విధంగా శ్రీకాకుళం,విజయనరం జిల్లాల్లో నూతన స్టేడియంల నిర్మాణాలను త్వరలో చేపట్టనున్నట్టు మంత్రి చెప్పారు.

ఖేల్ ఇండియా కింద కడప జిల్లా వైయస్సార్ క్రీడాపాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా ఎంపిక
కడప జిల్లాలోని వైయస్సార్ క్రీడా పాఠశాల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఖేల్ ఇండియా పధకం కింద సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా ఎంపికైందని మంత్రి శ్రీనినాస్ వెల్లడించారు. దానివల్ల ఏడాదికి 3కోట్ల రూ.లు నిధులు ఆకేంద్రానికి రానున్నాయన్నారు.

త్వరలో ఎపి యూత్ సర్వీసెస్ పేరిట ప్రత్యేక యూటూబ్ చానల్ ప్రారంభం
రాష్ట్రంలో క్రీడలకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను వీక్షించేందుకు వీలుగా ఎపి యూత్ సర్వీసెస్ పేరిట ప్రత్యేక యూటూబ్ చానల్ ను త్వరలో ప్రారంభించనున్నట్టు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు.క్రీడలకు సంబంధించి ఇప్పటి వరకూ జరిగిన కార్యకలాపాలన్నిటినీ దానిలో పొందుపర్చడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
 
అంతకు ముందు సచివాలయంలోని మంత్రి చాంబరులో పర్యాటక,సాంస్కృతిక,క్రీడా విభాగాలపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షంచారు.ఈసమావేశంలో పర్యాటక,సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి రాంగోపాల్,పర్యాటకశాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్,ఆర్కివ్స్ అండ్ మ్యూజియం శాఖ కమీషనర్ వాణీ మోహన్,శాప్ ఎండి బి.రామారావు,యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్,పర్యాటకశాఖ ఇడి వై.సత్యనారాయణ,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.