ఉపాధి హామీకి రూ. 582 కోట్లు విడుదల: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నిరుపేద కూలీలను ఉద్దేశించి ప్రారంభించిన పథకం. ఈ పథకం ద్వారా మన రాష్ట్ర౦లో దాదాపు 60 లక్షల మంది లబ్ది పొందుతున్నారు. రాష్ట్ర౦లోని 13 జిల్లాల్లో ఈ పథకం కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తతో అమలుచేస్తోంది.
పథకంలో పని చేస్తున్న కూలీలకు తక్షణ వేతన చెల్లింపుల నిమిత్తం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 582. 47 కోట్లు విడుదల చేసిందని, ఈ వేతన మొత్తాలు అప్ లోడ్ చేసిన ఎఫ్. టి. ఒలు ఆధారంగా ఎప్పటికప్పుడు వేతనాదారుల ఖాతాలకు నేరుగా జమ అవుతాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
గత ఆర్ధిక సంవత్సరంలోని వేతన బకాయిలు ఈ మొత్త౦లో కలిసి ఉన్నాయని అంటూ, పని కోరిన కూలీల౦దరికి పని కల్పించాలని మంత్రి డ్వామా పిడిలను కోరారు. ఒకవైపు మండు వేసవి, మరో వైపు కరోనా వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భౌతిక దూరం పాటిస్తూ, కరోనా జాగ్రత్తలు కూలీలకు అవగాహన పరుస్తూ ఉపాధి హామీ సిబ్బంది వారికి పనులు కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
కరవు పరిస్థితులు ఉన్న మండలాల్లో అడిగిన ప్రతి కూలీకి పని కల్పించాలని, నిధుల కొరత లేదని, పని కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని 13 జిల్లాల అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.