ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదు: పేర్ని నాని
ఏపీలో ఏపీఎస్ ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీలో లాక్ డౌన్ తర్వాత భారీగా చార్జీలు పెంచుతారు అనేది అవాస్తవం అని మంత్రి స్పష్టంచేశారు.
ఈ విషయంపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు మేరకు నడుచుకుంటామని చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బస్ లు తిప్పమని ఆదేశాలు ఇస్తే వెంటనే బసులు నడుపుతామని వివరించారు.
కాగా.. కోవిద్-19 లాక్ డౌన్ నిబంధనలతో గత 50 రోజులుగా ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల సర్వీసులు సైతం ప్రభుత్వాలు నిలిపివేశాయి.
అయితే తాజాగా కేంద్రం లాక్ డౌన్ విషయంలో కొన్ని సడలింపులు, మినహాయింపులు ఇవ్వడంతో ఏపీలో రోడ్డెక్కేందుకు ఆర్టీసీ బస్సులు సిద్ధమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సుల నిర్వహణకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు.