బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:31 IST)

ఏపిలో చిన్నారులందరికీ సురక్షిత నీరు: గవర్నర్ బిశ్వభూషణ్

జ‌ల‌జీవన్ మిషన్‌ను సద్వినియోగం చేసుకోవటం ద్వారా ప్రతి చిన్నారి సురక్షితమైన నీటిని పొందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు రక్షిత నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ వినూత్న కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తెరగాలన్నారు.

జలజీవన్ మిషన్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, సంబంధింత విభాగాల కార్యదర్సులతో సమావేశ‌మ‌య్యారు. కరోనా నేపధ్యంలో రాజ్ భవన్ నుండి ఆన్‌లైన్ విధానంలో కార్యక్రమం నిర్వహించగా అధికారులు సచివాలయంలోని  వారి కార్యాలయాల నుండి సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అసురక్షిత నీటి వినియోగం వల్ల పిల్లలు టైఫాయిడ్, విరేచనాలు, కలరా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రయోజనం కోసం జల్ జీవన్ మిషన్‌ను భారత ప్రధాని ప్రారంభించగా, ఈ పధకం  చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచటంతో పాటు వారి సంపూర్ణ వృద్ధికి సహాయ పడుతుందన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో కాలపరిమితితో కూడిన ప్రచారాన్ని రూపొందించాలని, గ్రామ పంచాయతీలు,జల, పారిశుద్ధ్య కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాల సహకారంతో అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీలలో ‘100 రోజుల కార్యక్రమం’ అమలు చేయాలని గవర్నర్ అధికారులను అదేశించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ మాట్లాడుతూ పధకం అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలకు పైపుల ద్వారా రక్షిత నీటిని అందించడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి  శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పాఠ‌శాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ  తదితరులు ఆయా శాఖల పరిధిలోని సంస్థలలో ‘100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే కార్యాచరణ ప్రణాళికల గురించి వివరించారు.

తొలుత గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా జల్ జీవన్ మిషన్ ద్వారా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పైపు నీటిని అందించడానికి నిర్ధేశించిన 100 రోజుల కార్యక్రమం లక్ష్యాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.