మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (20:41 IST)

చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా చంద్రబాబు పరిస్థితి : సజ్జల

కేంద్రంలోని ప్రముఖులను సీఎం జగన్ ఎప్పుడు కలిసినా రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి ఎలా నచ్చచెప్పి రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇవాళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇది రొటీన్‌గా జరిగే వ్యవహారమే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, ఆర్థికలోటు వంటి పెండింగ్‌ అంశాలపై సీఎం శ్రీ జగన్ కేంద్రంతో చర్చించనున్నారు. 
 
వైయస్‌ఆర్‌సీపీకి, కేంద్రంలో ఉన్న బీజేపీ, ఎన్డీయేతో రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. కేంద్ర హోంమంత్రితో సీఎం జగన్‌ రాష్ట్ర సమస్యలపైనే చర్చిస్తారు. ఇతర అంశాలు చర్చిస్తున్నప్పుడు ఏవైనా రావొచ్చు ఏమో. ప్రధానంగా కేంద్రంతో రాష్ట్రంకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై మాట్లాడటానికే సీఎం వైయస్‌ జగన్ ఢిల్లీ వెళ్లారు. ఇందులో రాజకీయం ఏమీ లేదు. 
 
 
వికేంద్రీకరణ విషయంలో హైకోర్టును కర్నూలుకు మార్చాలంటే కేంద్రం ప్రభుత్వం, కేంద్ర న్యాయవ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంది. దాని వెనుక ప్రాతిపదికను ముఖ్యమంత్రి వివరిస్తారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం శ్రీ జగన్ చర్చిస్తారు. ఇప్పటివరకు వచ్చిన నిధులు, రావాల్సిన నిధులపైనే చర్చిస్తారు. 
 
ప్రతిపార్టీకి ఓ విధానం ఉంటుంది. రహస్య చర్చలు, తెరవెనుక అజెండాలు, ఎవరో ఒకర్ని బ్రతిమాలుకోవటం వంటివి మాకు ఉండాల్సిన అవసరం లేదు. చంద్రబాబు హయాంలోనూ, గతంలోనూ తెరవెనుక ఇలాంటివి జరిగాయి. కాంగ్రెస్‌ హయాంలోనూ జరిగాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షనాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన సందర్భాల్లో ఏం చేశారో అందరూ చూశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని రకరకాలుగా వాడుకొని, తన అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. మాకు అటువంటి అవసరం లేదు. ఎంతో పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని సజ్జల తెలిపారు.  
 
ముఖ్యమంత్రి జగన్ రాజకీయమే ప్రధానం అనుకుంటే వేరేలా ఉండేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ శ్రీ జగన్ హిస్టరీనే మార్చారు. జగన్ వ్యక్తిగత హిస్టరీ చూసినా పదేళ్ల రాజకీయ జీవితం చూసినా చెప్పింది .. చేసుకుంటూ వెళ్తారు తప్ప తెరవెనుక అజెండాతో ఎప్పుడూ వ్యవహరించలేదు. తెరవెనుక అజెండాతో వ్యవహరించే వ్యక్తి కాదని జగన్ ప్రూవ్‌ చేసుకున్నారు. 
 
కొడాలి నాని దేవినేని ఉమాను కొడతానని అన్న వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ... ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఒక్కొక్కరు తాము ఆగ్రహంతో ఉన్నామని చెప్పే విధానాన్ని ఒక్కోలా వెల్లడిస్తుంటారు. ఎవరు మాట్లాడినా పరుషంగా, ఇంకోరకంగా మాట్లాడటం సరైంది కాదు. అవతల వారికి ఎంత చెప్పినా అవతలవాళ్లు వినకపోతే వచ్చే ఆవేశంలో ఒక్కొక్కరు చెప్పే భాష విధానంలో తేడా ఉంటుంది. కొడాలి నాని భాషలో నాకు అదే కనపడిందని సజ్జల అన్నారు. 
 
చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు.. ప్రతిరోజూ అబద్దాలే చెబుతూ వాటిని నిజం చేయాలనుకుంటే .. ముతక భాషలో కొడాలి నాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేగానీ ఈయన వెళ్లి కొట్టేది లేదు.. ఆయన వచ్చి డొక్క తీసేది ఉండదని సజ్జల తెలిపారు. అలాంటి భాష కూడా సరికాదు. రాజకీయంగా టీడీపీ వారు వాడుతున్న భాష కూడా సరిగా లేదని సజ్జల తెలిపారు. ఇలాంటి భాషకు టీడీపీనే బాధ్యత వహించాలి.
 
అమరావతి భూముల వ్యవహారంపై సీబీఐకి ఇవ్వటం జరిగింది. రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంలో ఇంకా చాలా ఉంది. కిలారి రాజేష్ అంశం చాలా చిన్నది. దర్యాప్తులో కచ్చితంగా  వాళ్ల తప్పులు దొరుకుతాయి.