శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (05:46 IST)

నిస్వార్థ సేవకులకు వందనం: మంత్రి వెలంపల్లి

ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయడం దైవత్వమే అవుతుందని, అటువంటి నిస్వార్థ సేవకులను సత్కరించుకోవడం హర్షణీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న 10 మంది విశిష్ట వ్యక్తులను రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నగరంలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఈ అన్-సంగ్ హీరోస్ సత్కార సభలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ సేవకులను సత్కరించటం స్ఫూర్తిదాకమని కొనియాడారు. రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఈ తరహా కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని మంత్రి సూచించారు.

హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వంగల ఈశ్వరయ్య మాట్లాడుతూ రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం చేసేందుకు ప్రతిఒక్కరూ మనస్ఫూర్తిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ జి.ప్రశాంతి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి సేవలందిస్తున్న సన్మానగ్రహీతలు అభినందనీయులని అన్నారు.

రక్తదానం, అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణతో పాటు సామాజిక బాధ్య‌త‌గా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులను డాక్టర్ ప్రశాంతి ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు జి.శ్రీధర్, భాస్కర్, అడ్మినిస్ట్రేటర్ పిన్నమనేని కల్యాణి, సురేష్, దుర్గాకాంత్ తదితరులు పాల్గొన్నారు.