బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జులై 2020 (20:28 IST)

కరోనా రోగులకు అభయం.. డాక్టర్ అమ్మన్న బృందం ఉచిత వైద్య సేవలు

కరోనా మహమ్మారి బారినపడి ఆందోళన చెందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు అరుణ్ కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్ నలమాటి అమ్మన్న నేతృత్వంలోని స్వచ్చంద సేవకుల బృందం అండగా నిలుస్తోంది. కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తులకు ఉచిత వైద్య సహాయం అందించడమే కాకుండా, వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందిస్తున్నారు.

డాక్టర్ అమ్మన్న బృందం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ బుధవారం ప్రారంభించారు. కోవిడ్-19 విపత్తును ఎదుర్కొనేందుకు నిస్వార్థంగా ముందుకువచ్చిన డాక్టర్ అమ్మన్న బృందాన్ని కలెక్టరు ఈ సందర్భంగా అభినందించారు.

వైరస్ బారినపడిన వారు అనుసరించాల్సిన విధివిధానాలను వారికి ఎప్పటికపుడు వివరిస్తూ, మార్గనిర్దేశం కావిస్తున్న డాక్టర్ అమ్మన్న బృందం పాజిటివ్ రోగులకు కొండంత భరోసా ఇస్తోంది. కోవిడ్-19 వైరస్ పట్ల సామాన్య ప్రజల్లో నెలకొని వున్న అపోహలను, ఆందోళనలను తొలగించి, పాజిటివ్ వ్యక్తులకు నాణ్యమైన వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ఈ వాలంటీర్ల బృందం కార్యాచరణను రూపొందించుకుంది.

డాక్టర్ అమ్మన్న కుమార్తె నలమాటి శ్రీలక్ష్మి ఆలోచనతో ఈ కోవిడ్-19 సేవా బృందం ఆవిర్భవించగా, పలువురు వైద్య నిపుణులు, మెడికల్ రిప్రజెంటేటివ్‌లు, ఫార్మసిస్టులు ఈ బృందంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. వైరస్ బారినపడిన వారి కోసం మూడు హెల్ప్ లైన్‌లను ఏర్పాటు చేసిన డాక్టర్ అమ్మన్న బృందం.. ఈ సహాయ కేంద్రాల ద్వారా పాజిటివ్ వ్యక్తులకు నిరంతర సేవలందిస్తున్నారు.

కరోనా లక్షణాలు, పాజిటివ్ వ్యక్తుల రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి కావలసిన వైద్య సహాయం అందిస్తున్నారు. వైరస్ బారినపడిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వాలంటీర్ల ద్వారా అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నారు.

కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్న తరుణంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డాక్టర్ అమ్మన్న తెలిపారు. కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ సోకిన వారిలో 85 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని ఆయన వివరించారు.

పది శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుందని, కరోనా పాజిటివ్ కేసుల్లో కేవలం ఐదు శాతం మందికి మాత్రమే తీవ్రమైన వ్యాధి లక్షణాలతో అత్యవసర చికిత్స అవసరమవుతుందని చెప్పారు. పాజిటివ్ వ్యక్తులు ఇంట్లోనే వుంటూ, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ నుండి సులువుగా విముక్తులవుతారని అన్నారు.

కరోనా విపత్తులో పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ ధనుంజయ, డాక్టర్ నేహ, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ రాజారావు తదితర వైద్య ప్రముఖులు ముందుకువచ్చారని తెలిపారు.

కరోనా పాజిటివ్ రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ల ద్వారా కరోనా పాజిటివ్ వ్యక్తులు వైద్య సేవలను పొందవచ్చని డాక్టర్ నలమాటి అమ్మన్న పేర్కొన్నారు.