శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:02 IST)

చంద్రగిరిలో ముందే ‘సంక్రాంతి’

రాష్ట్రమంతటా సంక్రాంతి జనవరిలో వస్తే ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం ఆ పండగ ఒక్కటే కాదు క్రిస్మస్, నూతనసంవత్సరం సంబరాలు ముందుగానే ప్రారంభమవుతాయి. వేలాది కుటుంబాలకు ఈ పండగలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం రోజు నుంచే ప్రారంభమవుతాయి. 
 
అటు పార్టీ నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి తన నియోజకవర్గంలో సేవలు అందించే వారిని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సత్కరిస్తుంటారు. ఇది ఏటా క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమమే. అందులో భాగంగానే ఈ యేడాది కూడా 25 వేల కుటుంబాలకు దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇది కనీసం పది రోజులపాటు నిర్విగ్నంగా కొనసాగుతుంది. 
 
ఆయన చాలా సాంప్రదాయబద్దంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఒక కుటుంబానికి కాస్త సాయం చేశారంటే ఎన్నటికీ గుర్తుపెట్టుకుంటారు. కానీ, ఇక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే నేరుగా ఆ కుటుంబ దంపతులకు దుస్తులు, వారికి వేంకటేశ్వరస్వామి కరుణాకటాక్షాలు ఉండాలనే ఉద్దేశ్యంతో లడ్డూ ప్రసాదాన్ని కూడా పంపిణీ చేయడం నిజంగా శుభకార్యక్రమంగానే భావించాలి. 
 
ఇంటి యజమానికి ఒక రైమాండ్స్ ప్యాంటు షర్టు, ఆ ఇంటి ఇల్లాలికి లెనిన్ కాటన్ జాకెట్‌తో కూడా చీరె, తిరుమల లడ్డూ, శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డు, నోరు తీపి చేస్తూ ఒక స్వీట్ బాక్సును అలాగే క్యాలెండర్ ను ఒక బ్యాగులో పెట్టి వారికి అందజేస్తారు. కొత్తదుస్తులు ఇచ్చే ఈ కార్యక్రమాన్ని తెలుగువారు సత్కారంగానే, సన్మానంగానే భావిస్తారు. సరిగ్గా తన నియోజకవర్గానికి సేవలు అందిస్తున్న ఆ కుటుంబాలు సిరిసంపదలతో వర్ధిల్లాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే పని చేస్తున్నారు. ఇందుకు రూ.5.20 కోట్లు వెచ్చించారు. 
 
ప్రభుత్వంలోని చిరు ఉద్యోగి నుంచి అధికారి వరకూ... 
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిరుపేదలకు అందించడంలో సహకరిస్తున్న ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి, కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో తెగువ చూపి పని చేసిన ప్రతి ఒక్క శాఖకు ఈ సత్కారాన్ని ఆయన చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పనిచేసే 780 పారిశుద్ధ్య కార్మికులు, 505 అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలు, 315 ఆరోగ్య కార్యకర్తలు, 729 ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, 510 సంఘ మిత్రులు, ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, పోలీసులు, పంచాయతీ స్థాయి అధికారులు, 1880గ్రామ సచివాలయం సిబ్బంది,  4200 వాలంటీర్లకు సత్కారంగా సంప్రదాయబద్ధంగా ఈ దుస్తులను పంపిణీ చేశారు. వారితోపాటు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తు జనాన్ని జాగృతం చేయడంలో చొరవ చూపిన 810 పాత్రికేయులకు కూడా ఈ సత్కారాన్నే అందజేశారు.  
 
పార్టీ జెండా మోసిన పార్టీ కేడర్‌కు కూడా.. 
పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పార్టీ జెండా మోసిన వారు, పార్టీ ఉద్యమాల్లో పాల్గొన్నవారు, పార్టీ ఎన్నికలలో పాల్పంచుకున్నవారు, పార్టీకి అండగా నిలిచినవారు, పార్టీలో వివిధ పదవులలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సేవలు అందించిన వారు, ఎన్నికల నాడు ఏజెంట్లుగా నిలిచిన వారు, చివరకు పార్టీ ఓటరు స్లిపులను రాసిన వారు ఇలా పార్టీ కోసం పాటుపడిన వారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృతజ్నతలు తెలపాలని నిర్ణయించుకున్నారు. 
 
అందుకు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని ముహుర్తంగా ఖారారు చేసుకున్నారు. అందులో భాగంగానే కార్యకర్తలు, నాయకులు, వివిధ స్థాయిలలో వివిధ రూపాలలో పార్టీ కోసం పని చేసిన 16,000 మందికి ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతికి సమీపంలోని ముక్కోటి శివాలయం సమీపంలోని నారాయణి గార్డెన్స్ లో మంగళవారం మధ్యహ్నం 25 వేల దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల బ్యాగ్ ను అందించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 
 
జననేత జగనన్న జన్మదిన శుభాకాంక్షలు 
నియోజకవర్గంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సంఘ మిత్రులు, ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ స్థాయి అధికారులు, వాలంటీర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి గౌరవించడం తన బాధ్యతని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు ఒక భాగం అయితే.. ప్రజలు కోసం పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను, సీఎం జగనన్న ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న పారిశుద్ధ్య, అంగనవాడీ, సచివాలయం సిబ్బంది తదితర ఉద్యోగులు మరో భాగమని తెలిపారు.
 
తన రాజకీయ ఎదుగుదలకు దోహదం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల బాగోగులు చూస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు. మొత్తం 25 వేల మందికి జగనన్న జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వివరించారు. ప్రజలకు సమాచారం చేరవేసే పాత్రికేయులు సహకరించారని వారిని కొనియాడారు. 
 
తన వంతు బాధ్యతగా నాణ్యమైన లెనిన్ క్లాత్ చీర, రేమండ్ ఫాంట్, షర్ట్, గ్రీటింగ్ కార్డు, టీటీడీ శ్రీవారి ప్రసాదం, క్యాలెండర్, స్వీట్ బాక్స్, చక్కటి బ్యాగ్ ను బహుమానంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఏటా ఈ బహుమానాలను వారివారి ఇంటికి పంపడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సీఎం జగనన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.5.20 కోట్లు ఖర్చుతో ప్రజలు, వ్యక్తుల గౌరవార్థం చిన్నపాటి బహుమానం అందించేందుకు సంకల్పించినట్లు తెలిపారు. రక్తదాన శిబిర కార్యక్రమాల కారణంగా నేటి నుంచి 25 వేల కుటుంబాలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు.