గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (15:42 IST)

మహాశివరాత్రి- వీరభద్ర స్వామి ఆలయంలో సత్యవతి రాథోడ్ పూజలు

మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా, కురవి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "సీఎం కేసీఆర్ గారు, కురవి వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో మంత్రిని అయ్యాను.
 
సీఎం కేసీఆర్ గారు స్వయంగా వచ్చి కోర మీసాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు. సీఎం అయ్యాక వచ్చి మీసాలు సమర్పించారు. ఈరోజు డోర్నకల్ రైతులు సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చినట్లు నేడు సాగునీరు, తాగునీరు వస్తున్నాయి. గుడి అభివృద్ధికి సీఎం కేసీఆర్ గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. 
 
సీఎం ఈ నిధులు ఇచ్చిన తర్వాత 3 జాతరలు అయిపోయాయి. అయితే పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. త్వరలో ఈ పనుల తీరును సమీక్షించి, ఇంకా అవసరమైతే సీఎం కేసీఆర్ గారిని అడిగి మరిన్ని నిధులు తెచ్చి ఈ దేవస్థాన అభివృద్ధికి మండల బిడ్డగా, మంత్రిగా కృషి చేస్తాను. సుమారు 1000 కోట్ల రూపాయలతో సీఎం కేసీఆర్ గారు యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నారు. 
 
రాష్ట్రంలోని దేవాలయాలన్నిటికి నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా స్వామివారు ఆశీర్వదించాలని ప్రార్థించాను. 
 
సీఎం కేసీఆర్ గారి పేరు మీద అర్చన చేయించాను. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలని సీఎం కేసీఆర్ గారు చేస్తున్నారు. ఆయనకు మరింత శక్తినివ్వాలని ప్రార్థించాను.
 
ఈరోజు భక్తులు మహాశివుణ్ణి పూజించి అనేక కోర్కెలు కోరుకుంటున్నారు. వారి కోర్కెలు నెరవేరేవిధంగా ఆశీర్వదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు. 
 
అనంతరం మహిళా - శిశు సంక్షేమ శాఖ అధికారులు రూపొందించిన ఆపదలో ఉన్న 18 ఏళ్ల లోపు బాలికల అభయ హస్తం 1098 పోస్టర్ విడుదల చేసారు. 
 
ఆ తరవాత ప్లాస్టిక్ నివారించి, పర్యావరణ హితమైన బ్యాగులు వాడాలని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తయారు చేసిన సంచులు విడుదల చేసారు.
 
అనంతరం వీరభద్ర స్వామి జాతరలో గాజులు వేయించుకున్నారు. తన మనవరాలి కోసం బొమ్మలు కొన్నారు. కురవి జాతర వద్ద ఉన్న దుకాణదారులను పేరు పేరున పలకరించి, వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. అన్ని దుకాణాలు తిరుగుతూ జాతర షాపింగ్ చేశారు.

జాతరలో పీక కొని పీకల ఊదుతూ సందడి చేశారు. చివరగా ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పారు.