చంద్రబాబుకు పాలించే హక్కు లేదు... ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : రాష్ట్రపతికి కట్జూ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ కట్జూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతితో పాటు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ కట్జూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతితో పాటు.. ప్రధానమంత్రికి లేఖ రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న నెటిజన్ల హక్కులను కాలరాస్తూ వారి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు అనాగరికంగా వ్యవహరిస్తోందని అందువల్ల టీడీపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ డిమాండ్ చేశారు.
టీడీపీ ప్రభుత్వ పనితీరుతోపాటు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది నెటిజన్లు వివిధ రకాల పోస్టులు చేశారు. వీటినీ సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సర్కారు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించింది. ముఖ్యంగా, వైకాపా పొలిటికల్ పంచ్ అడ్మినిస్ట్రేటర్ రవికిరణ్‌ను అరెస్టు చేసింది.
వీటిపై మార్కండేయ కట్జూ స్పందించారు. నెటిజన్లపై ఉక్కుపాదం మోపుతూ అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ, తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. రాష్ట్రపతికి, ప్రధానికీ ఓ లేఖను రాస్తూ, కార్టూన్లు భావ ప్రకటనా హక్కులో భాగమని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని, అది ఆర్టికల్ 19 (1) ఏ కింద ఇవ్వబడిన హక్కని అన్నారు.
ప్రజలే ప్రభువులైన ఇండియాలో పాలకులను విమర్శించే హక్కు ప్రజలకుందని, కానీ, సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు అనాగరికంగా, అప్రజాస్వామికంగా ఉందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్టికల్ 356ను ప్రయోగించి, తక్షణం ప్రభుత్వాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.