1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆంధ్రాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

schools
వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. ఈ యేడాది పాఠశాలలు తెరిచేందుకు అదనంగా 22  రోజుల సమయం లభించినప్పటికీ పాఠశాలలకు మాత్రం పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక సామాగ్రి చేరనేలేదు. దీంతో విద్యార్థులు పాఠపుస్తకాలు, యూనిఫామ్స్, బూట్లు లేకుండానే బడులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
అదేసయమంలో మంగళవారం నుంచి పాఠశాలలకు వచ్చిన అరకొర వస్తువులతోనే ఉపాధ్యాయులు కిట్లను సిద్ధం చేశారు. పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు, ఏకరూప దుస్తులు, నిఘంటువులు బడులకు చేరకపోవడంతో పంపిణీ సమయాన్నే పెంచేశారు. విద్యా కానుక వస్తువులు సరఫరా కాలేదనే లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈనెలాఖరు వరకు విద్యార్థులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
 
దీంతో వస్తువుల సరఫరాకు గుత్తేదార్లకు మరో 25 రోజుల అదనపు సమయం లభించగా.. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, బూట్లు లేకుండానే బడులకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 1-10 తరగతి వరకు 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు క్షేత్రస్థాయికి 70 శాతం చేరాయి. 
 
ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ చేరలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 47.40 లక్షల మంది విద్యార్థులకు అందించాల్సిన బూట్లు, యూనిఫామ్స్ 30 శాతం మాత్రమే సరఫరా అయ్యాయి. బ్యాగ్‌లు 60 శాతం, నిఘంటువులు 50 శాతంలోపే చేరాయి. ఈ పరిస్థితికి ప్రభుత్వం నిధులు సమకూర్చలేక పోవడమేనని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.