సీఎం జగన్ పాలనలో ఆర్టీసీ బాదుడు.. కనిష్టంగా రూ.5, గరిష్టంగా రూ.80 పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్టీసీ చార్జీల మోత మోగించారు. డీజిల్ సెస్ పేరుతో ఈ బాదుడుకు శ్రీకారం చుట్టారు. అయితే, సిటీ బస్సుల్లో మాత్రం ఈ బాదుడు నుంచి మినహాయింపునిచ్చారు. జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన పెంపు భారం కనీసం రూ.5గాను అత్యధికంగా రూ.80గా ఉంది. ఏపీ నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్లే బస్సులో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణ చార్జీలను భారీగా పెంచేశారు. అయితే, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో మాత్రం కొంతదూరం వరకు ఈ పెంపు నుంచి మినహాయింపునిచ్చారు.
ప్రయాణ దూరాన్ని ఆధారంగా చేసుకుని ఈ చార్జీలను పెంచకపోవడం గమనార్హం. కేవలం డీజిల్ సెస్ పేరుతో బాదేశారు. పెంచిన డీజిల్ సెస్ శుక్రవారం నుంచే అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కొత్త బాదుడు మేరకు పల్లె వెలుగు బస్సుల్లో కనీస చార్జీ ప్రస్తుతం రూ.10గా వుంది. 30 కిలోమీటర్ల మేరకు పల్లె వెలుగు బస్సులో ఈ డీజిల్ సెస్ పెంపును మినహాయించారు. ఆ తర్వాత 30 నుంచి 60 కిలోమీటర్ల వరకు రూ.5, 60 నుంచి 70 కిమీ వరకు రూ.10 చొప్పున వసూలు చేయనున్నారు.
ఇక ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులో డీజిల్ సెస్ పేరిట రూ.5 వసూలు చేస్తున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్ సెస్‌ను మినహాయించారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 30 కమీ వరకు రూ.5, 60 నుంచి 70 వరకు అదనంగా రూ.10 చొప్పున వసూలు చేస్తారు.
ఇక దూర ప్రాంతాలకు తిరిగే సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ప్రస్తుతం డీజిల్ సెస్ పేరిట రూ.10 మాత్రమే వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సు్లో 55 కిమీ వరకు డీజిల్ సెస్‌ను పెంచలేదు. హైదరాబాద్ వెళ్లే బస్సులో డీజిల్ సెస్‌ను ఏకంగా రూ.70 మేరకు, హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట రూ.80 వసూలు చేయనున్నారు.