సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (11:03 IST)

ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు.. ఎందుకో తెలుసా?

apsrtc
ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా అనంతర పరిస్థితులు, చిల్లర సమస్యలను అధిగమించడంతోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలోనే తొలిసారిగా ఏపీఎస్ఆర్టీసీ ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఈ-పోస్‌ మిషన్లను పరిచయం చేయనుంది. 
 
పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పుడున్న టికెట్‌ ఇష్యూయింగ్‌ యంత్రాల (టిమ్‌) స్థానంలో ఈ-పోస్‌ మిషన్‌ను ప్రవేశపెట్టడానికి విజయవాడ, గుంటూరు-2 డిపోలను ఎంపిక చేశారు. 
 
ఈ రెండు డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో గత మూడు రోజులుగా ప్రయోగాత్మకంగా వీటిని పరిశీలిస్తున్నారు. 
 
కొన్నిరోజుల పాటు పరిశీలించి ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి వచ్చే స్పందనలను అనుసరించి మిగిలిన డిపోల్లో కూడా దశలవారీగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని జిల్లాల పరిధిలోని డిపోలకు సంబంధించి ఇద్దరి చొప్పున ఆయా జోన్ల ప్రధాన కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు.
 
ప్రతి డిపోకు ఈ-పోస్‌ మిషన్‌ ఒక్కొక్కటి చొప్పున అందించారు. ప్రస్తుతం ఆ మిషన్ల సాఫ్ట్‌వేర్‌కు ఆయా డిపోల పరిధిలో ఎన్ని సర్వీసులున్నాయి. 
 
కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో స్వీయ నియంత్రణ పాటించకపోతే కొవిడ్‌ తప్పక సంక్రమిస్తుందని విస్తృతంగా ప్రచారం వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆర్టీసీ ఎండీగా ఉన్న ఓ ఐపీఎస్‌ అధికారి వాణిజ్య సముదాయాలు, రెస్టారెంటుల్లో అమలవుతున్న నగదు రహిత విధానాన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రవేశపెడితే అంటువ్యాధులకు చెక్‌ పెట్టవచ్చని భావించారు. 
 
నగదు రహితంగా డిజిటల్‌ చెల్లింపులు ఎన్ని రకాలుగా చేయగలమో (ఫోన్‌పే, గూగుల్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌, పేటీఎం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల స్వైపింగ్‌ వంటివి) అన్ని అవకాశాలను ఆ మిషన్‌లో పొందుపరిచారు. ఒకవేళ నగదు చెల్లించాలన్నా ఆ వెసులుబాటు కల్పించారు.