శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:42 IST)

సచివాలయ ఉద్యోగాల భర్తీ దేశ చరిత్రలోనే రికార్డు.. మంత్రులు

రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నిర్వహించిన పరీక్షల ఫలితాల వివరాలను అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనల్లో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఆచరలోకి తీసుకువచ్చారని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఈ తరహాలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ లేదని అన్నారు. ప్రతి యాబై కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్, మున్సిపాలిటీల్లో వార్డు వాలంటీర్లను నియమించడం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరువ చేస్తామని అన్నారు. 

నవరత్నాలలో పొందుపరిచిన అంశాలు.. మేనిఫేస్టోలో చెప్పిన అంశాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కృతనిశ్చయంతో వున్నారని అన్నారు. ప్రతి సచివాలయంలో పదకొండు నుంచి పన్నెండు మంది ఉద్యోగులు పనిచేస్తారని, మొత్తం 1,26,728 కొత్త ఉద్యోగాలను వ్యవస్థను సృష్టించడం జరిగిందన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అక్టోబర్‌ రెండో తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగాల కోసం ఆరు రోజుల పాటు అత్యంత పకడ్బందీగా పరీక్షలను ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించిందని అన్నారు.

దేశ చరిత్రలో ఒకే రిక్రూట్ మెంట్‌ నోటిఫికేషన్‌ ద్వారా 1,26,728ని ఎంపిక చేసేందుకు పరీక్షలు నిర్వహించడం అరుదైన రికార్డు అని అన్నారు. మొత్తం పంతొమ్మిది రకాల పరీక్షలను భర్తీ చేయడానికి పద్నాలుగు రకాల పరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఈ పరీక్షలకు 21.69 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 19.50 లక్షల మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు.

ఈ పరీక్షల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహించామని తెలిపారు. పరీక్షలు రాసిన సుమారు పంతొమ్మిది లక్షలకు పైగా అభ్యర్ధుల ఓఎంఆర్‌ షీట్‌ లను రికార్డు సమయంలో స్కాన్ చేశామని అన్నారు. అభ్యర్ధులను ఎంపిక చేయడానికి కనీస ఉత్తీర్ణతా మార్కులను కూడా నిర్ణయించామని అన్నారు.

ఓపెన్ కేటగిరి అభ్యర్ధులకు నలబై శాతం, బిసిలకు ముప్పై అయిదుశాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ముప్పై శాతంగా ఖరారు చేశామని తెలిపారు. ఈ పరీక్షలకు హాజరైన వారిలో 1,98,164 మంది ఉత్తీర్ణతను సాధించారని తెలిపారు. ఓపెన్ కేటగిరిలో 24,583 మంది, బిసి కేటగిరిలో 1,00,494 మంది, ఎస్సీ కేటగిరిలో 63,629 మంది, ఎస్టీ కేటగిరిలో 9458 మంది ఉత్తీర్ణతను సాధించారని తెలిపారు.

వీరిలో 1,31,327 మంది పురుషులు కాగా, 66,835 మంది మహిళలు వున్నారని అన్నారు. మొత్తం పద్నాలుగు పరీక్షల్లో ఓపెన్‌ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు, బిసి కేటగిరిలో 122.5 మార్కులు, ఎస్సీ కేటగిరిలో 114 మార్కులు, ఎస్టీ కేటగిరిలో 108 మార్కులు సాధించారని వెల్లడించారు.

మహిళా అభ్యర్ధుల్లో గరిష్టంగా 112.5 మార్కులు, పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు సాధించారని అన్నారు. అలాగే ఇన్‌ సర్వీస్‌ అభ్యర్ధులకు పదిశాతం వెయిటేజీ మార్కులు విడిగా కలుపుతామని తెలిపారు. ఫలితాల ప్రకటన తరువాత అర్హులైన అభ్యర్ధులు తమ ఒరిజినల్‌ సర్టిఫికేట్‌ లతో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని, ఆ తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా వెల్లడించిన తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు.

మీడియా సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ద్వివేది, కార్యదర్శి గిరిజా శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.