నగరాలు, పట్టణాల్లోని మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటికల నిజం చేసే దిశగా ముమ్మరంగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.పట్టణాలు, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలకు లాభాపేక్షలేకుండా సరసమైన రేట్లకే ఫ్లాట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్, అర్భన్ హౌసింగ్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్షి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం.ఎం.నాయక్, సీసీఎల్‌ఏ స్పెషల్ కమిషనర్ నారాయణ భరత్ గుప్త, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, టిడ్కో ఎండీ సిహెచ్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
స్మార్ట్ టౌన్‌షిప్‌లో ఉండాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలను అధికారులు సమర్పించగా వాటిపై సీఎం జగన్ కొన్ని మార్పులు, సూచనలు చేశారు. ప్రజలకు అత్యున్నత జీవన ప్రమాణాలను అందించాలన్నదే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
వివాదాలు, ఇబ్బందులు లేని, అన్ని అనుమతులతో కూడిన క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు మధ్యతరగతికి అందుబాటులోకి తీసుకురావాలని గతంలోనే ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల్లో ఇదివరకే అమలవుతున్న పలు పట్టణ ప్రణాళికలపై ఈ సందర్భంగా అధికారులు సీఎంతో చర్చించారు.
ఈ స్కీం కోసం భూములను ఎలా అందుబాటులోకి తీసుకురావాలి? మౌలిక సదుపాయాలను ఎలా కల్పించాలి? తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ప్లాట్లు ఇచ్చేలా ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూములు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కొంత ల్యాండ్ బ్యాంకు ఉండడంతో కొత్తగా వచ్చే దరఖాస్తుదారులకు ప్లాట్లు ఇవ్వగలుగుతామని పేర్కొన్నారు.
రింగురోడ్ల చుట్టూ స్మార్ట్‌టౌన్స్ లే అవుట్లు...
పట్టణాల చుట్టూ రింగురోడ్ల నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. భూములు ఇచ్చిన వారికి, ప్రభుత్వానికి ఉభయతారకంగా ప్రయోజనం కలిగేలా నిర్మాణం జరగాలని తెలిపారు. తొలివిడతగా 12 పట్టణాల్లో 18 లే అవుట్స్ చేపట్టాలని ప్రాథమిక నిర్ణయం లే అవుట్ ప్రతిపాదనలు చేశారు.
నగరాలు, పట్టణాల్లోని జనాభా ప్రాతిపదికన కనీసం 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు స్మార్ట్‌టౌన్స్ రూపకల్పనకు ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. పనులు ప్రారంభించిన తర్వాత 18 నెలల్లోగా లేఅవుట్ సిద్ధంచేసేలా ప్రణాళిక వేసినట్లు వివరించారు.
క్లాప్ ప్రారంభించండి...
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేలా 100 రోజుల కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు.క్లీన్ ఆంధ్రప్రదేశ్ సీఎల్‌ఏపీ (క్లాప్) పేరిట కార్యక్రమం నిర్వహించాలని, వీటిలో ఎన్జీఓలు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేయాలని సూచించారు.
కొత్తగా 3,825 చెత్తను సేకరించే వాహనాలు, మరిన్ని ఆటో టిప్పర్లు 6 వేలకు పైగా బిన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపాల్టీల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు, బయోమైనింగ్‌ను కూడా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాలతో పరిశుభ్రత విషయంలో మార్పు కనిపించాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.