శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:50 IST)

జీతాలకు డబ్బుల్లేవ్.. ఎర్రచందనం అమ్మేద్దాం: జగన్

ప్రభుత్వ ఆదాయ వనరులపై అధికారులు దృష్టి పెట్టాలని సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయ వనరుల పెంపుపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. దీనికోసం ప్రజలపై భారం వేయకుండా ఆదాయ వనరులను పెంచుకునేందుకు అవసరమైన ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఎపిఎండిసి టెండర్ల ద్వారా దక్కించుకున్న ఝార్ఖండ్‌ బ్రహ్మదిహ కోల్‌మైన్‌, మధ్యప్రదేశ్‌లోని సులియారీ, చత్తీస్‌ఘడ్‌లోని మదన్‌పూర్‌ సౌత్‌ బగ్గుల నిర్వహణ, మైనింగ్‌ కార్యకలాపాలను నిర్ణీత గడువులోగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సిఎం ఆదేశించారు.

రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే మైనింగ్‌ కార్యకలాపాలపై మరింత ఫోకస్‌ పెట్టాలని చెప్పారు. సిలికా శాండ్‌కు సంబంధించి ఎపిఐఐసితో సమన్వయం చేసుకుని వెంటనే కార్యకలాపాలు వేగవంతం చేయాలని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వెంటనే తీసుకొచ్చేలా ప్రయత్నించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

దీనిపై యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే అంశాలపై అధికారులు మరింత ఫోకస్‌తో పనిచేయాలని, వీటిపై నిరంతరం సమీక్షలు నిర్వహించి, ఎప్పటికప్పుడు అంచనాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.