బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (20:15 IST)

రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : మండలి బుద్ధప్రసాద్

రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నాదెళ్లవారి పాలెం గ్రామంలో శ్రీవనమలమ్మ తల్లి ఆలయంలో చోరి ఘటన నేపథ్యంలో ఆలయాన్ని బుద్ధప్రసాద్ ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కాలంలో విగ్రహాల ధ్వంసం...ఆభరణాలు..కానుకల చోరీలు జరుగుతున్నాయనీ..ఈ  సంఘటనలు బాధాకరమని పేర్కొన్నారు.
 
ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ మతపరమైన వైషమ్యాలు లేవని అన్ని మతాలు సామరస్యంగా జీవిస్తున్న రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. గత ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు అండగా నిలబడితే నేటి ప్రభుత్వంలో మెజార్టీ వర్గాల పైనే ఈ రకమైన దాడులు జరగడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
 
దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా దోషులను పట్టుకోవటంలో పోలీసు శాఖ వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రభుత్వం ఇంతగా ఎందుకు వైఫల్యం చెందిందని ప్రశ్నించారు.  నాటి అంతర్వేది ఘటన నుండి రామతీర్థం ఘటన వరకు ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగినా దోషులను పట్టుకోలేక పోవటంతో  దాడుల కొనసాగింపు జరుగుతున్నాయని పేర్కొన్నారు.  దురదృష్టవశాత్తు ఇది రాజకీయ సమస్యగా మారిపోతుందని వాపోయారు.
 
ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు చెబుతున్నారనీ..ఆదాయం లేని ఆలయాల్లో కెమెరాలు ఎలా ఏర్పాటు చేయగలరని ప్రశ్నించారు. ప్రభుత్వమే దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు. చోరీ సంఘటన నిగ్గు తేల్చాలనీ..దోషులను పట్టుకోవాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసారు.
 
 ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే అరికట్టలేక... పుష్కరాల్లో చంద్రబాబు దేవాలయాలను కూల్చివేసారని విమర్శిస్తూ ఆలయాల పునః నిర్మాణానికి నేడు శంఖుస్థాపన చేస్తున్నారనీ...18 నెలలుగా శంఖుస్థాపన విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
 
మతం ప్రస్తావన తీసుకువచ్చారని చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారనీ...ఈ రాష్ట్రంలో కులం మతం ప్రస్తావన తీసుకు వచ్చింది మొదట ముఖ్యమంత్రి అని విమర్శించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తే ఎస్ఈసీకి కులం ఆపాదించి విమర్శలు చేశారనీ.. కేసు పెట్టాలంటే ముందుగా ముఖ్యమంత్రి పైనే పెట్టాలన్నారు. కుల ప్రస్తావనలకు అంకురార్పణ చేసింది  ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు.