శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (20:15 IST)

వ్యవసాయానికి శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్‌: సర్కారు ప్రయత్నాలు

వ్యవసాయానికి శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్తు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం సాకారం అవుతోంది. ఆదిశ వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి.

గత ప్రభుత్వంలో అధికరేట్లకు విద్యుత్‌ ఒప్పందాలు కుదుర్చుకుని ప్రజల ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చిన పరిస్థితులకు భిన్నంగా తక్కువ ఖర్చుకు సౌరవిద్యుత్‌ను పొందేలా, తద్వారా విద్యుత్‌ సరఫరా కంపెనీలపైనా, ప్రభుత్వంపైనా భారాన్ని తగ్గించి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా, శాశ్వత ప్రాతిపదికన ఉచితంగా ఇవ్వడానికి 10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం నవంబర్‌ 30న టెండర్లను ఆహ్వానించింది.

నాలుగువారాల వ్యవధిలో మొత్తం 5 సంస్థలు 24 బిడ్లను దాఖలు చేశాయి. డిసెంబర్‌ 28న బిడ్ల స్వీకరణకు గడువు ముగిసింది. ఈ బిడ్లను త్వరలోనే తెరిచి తదుపరి రివర్స్‌టెండరింగ్‌ ప్రక్రియను నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి నాటికి నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుంది.
 
పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ:
10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుకోసం ప్రభుత్వం చాలా పారదర్శక విధానాలను అనుసరించింది. గతం ప్రభుత్వం మాదిరిగా లొసుగులు, అవినీతికి ఆస్కారమిచ్చే చర్యలకు పూర్తి చెక్‌పెడుతూ అడుగులు ముందుకేసింది. టెండర్ల ప్రక్రియలో అత్యంత పారదర్శక విధానానికి పెద్దపీట వేస్తూ దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టాన్ని అనుసరించి ప్రభుత్వం ముందుకు వెళ్లింది. 
 
టెండర్లు ఆహ్వానించేందుకు తయారుచేసిన డాక్యుమెంట్‌లో కూడా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు (ఎంఎన్‌ఆర్‌ఈ) అనుగుణంగా ఈ టెండర్‌ డాక్యుమెంట్‌ను రూపొందించింది. ఎంన్‌ఆర్‌ఈ మార్గదర్శకాలను పాటించే విషయంలో ప్రభుత్వం ఒక్క ఇంచి కూడా పక్కకు వెళ్లలేదు. 
 
తర్వాత టెండర్‌ డాక్యుమెంట్‌ను జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపింది. దీనికి నేతృత్వం వహిస్తున్న రిటైర్డ్‌హైకోర్టు జడ్జి ఈ డాక్యుమెంట్‌ను పరిశీలించారు. అంతేకాక 28 రోజుల పాటు వెబ్‌సైట్‌లో ప్రజాబాహుళ్యానికి అందుబాటులో ఉంచారు. 
 
ఈ డాక్యుమెంట్‌ను వెబ్‌సైట్‌లో నాలుగు వారాలు ఉంచిన తర్వాత దాదాపు 150కిపైగా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. వీటిపైన మళ్లీ అధికారులు తగిన వివరణలను రిటైర్డ్‌ హైకోర్టు జడ్జికి పంపారు. వాటిని పరిశీలించిన తర్వాత, నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత టెండర్‌ డాక్యుమెంట్‌ను ఖరారుచేశారు. 
 
విద్యుత్‌ రంగంలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న సమయంలో ఇంతటి పారదర్శకంగా ప్రక్రియ సాగడం ఇదే తొలిసారి. లొసుగులకు, లావాదేవీలకు, అవినీతికి కించిత్తు ఆస్కారం కూడా లేకుండా ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. 
 
10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు వెనుక:
రాబోయే రోజుల్లో విద్యుత్‌ వినియోగ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను అదుపులో పెట్టడంతోపాటు, నాణ్యమైన శాశ్వత ప్రాతిపదికిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించడానికి ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. 

సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ఖర్చును తగ్గించి అధిక ఆదాయం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. సోలార్‌ విద్యుత్‌ వినియోగం ద్వారా రాబోయే 30 ఏళ్లలో రూ.48,800 కోట్లు ఆదా చేసే అవకాశమున్న నేపథ్యంలో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై సబ్సిడీ భారమూ తగ్గే అవకాశముండటంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.
 
వ్యవసాయ విద్యుత్‌ వాడకం ఏటా పెరుగుతోంది. కొత్త కనెక్షన్లకు డిమాండ్‌ నెలకొంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్‌ లో వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం భారీగా సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత మొత్తం ఇవ్వడంలో వెనక్కి తగ్గితే వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సోలార్‌ పవర్‌  ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 
 
ఎలాంటి హానీ జరగకుండా కేవలం సౌరశక్తితో విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రయోజనాత్మకమైన ప్లాంట్లుగా సోలార్‌ పవర్‌ ప్లాంట్లను పేర్కొనవచ్చును. వీటి వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లదు. థర్మల్‌ ప్రాజెక్టుల మాదిరిగా విచ్చలవిడిగా కాలుష్యాన్ని విడుదలచేసేందుకు అవకాశమే లేదు.
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ద్వారా ఆమోదించిన గణాంకాల ప్రకారం  రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల ద్వారా ప్రతి ఏటా 12,221 మిల్లి యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారని తేలింది. డిస్కంలు 13,039 మిల్లి యూనిట్లు ఖర్చుచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో వ్యవసాయ విద్యుత్‌ కు వినియోగించిన సబ్సిడీ విపరీతంగా పెరిగింది. 
 
రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా విద్యుత్‌ వినియోగ సామర్థ్యం 8,354 మెగావాట్లు ఉంటుంది. వ్యవసాయానికి అందించే విద్యుత్‌ ఖర్చును ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో పంపిణీ సంస్థలకు అందిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ తక్కువగా ఉండేది. 2015–16లో రూ.3,186 కోట్లు ఉండగా 2018–19 నాటికిరూ.4 వేల కోట్లకు చేరింది.

ఈ మొత్తంను గత ప్రభుత్వం పూర్తిగా చెల్లించకపోవడంతో డిస్కమ్‌లు అప్పుల్లోకి వెళ్లాయి. 2020–21లో వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి ప్రభుత్వం రూ.8,354 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇది రెట్టింపుకన్నా ఎక్కువే.  
 
వ్యవసాయ పంపుసెట్లు కూడా సంవత్సరానికి 50 వేలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విద్యుత్‌ ఖర్చును అదుపులో పెట్టాలంటే సోలార్‌ విద్యుత్‌ను అందుబాటులో తేవడమే ఏకైక మార్గమని ప్రభుత్వం భావించి ఆదిశగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. 
 
సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పగటిపూట జరుగుతుంది. డిస్కంల దగ్గర కొనే విద్యుత్‌ కన్నా తక్కువకే దొరుకుతుంది. రాష్ట్రంలో 300 రోజులు ఎండకాసే రోజులు ఉంటాయి. పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలులో సోలార్‌ ఉత్పత్తికి అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం వినియోగించే విద్యుత్‌ లో 65 శాతం ఈ జిల్లాలే వినియోగిస్తున్నాయి.

97 శాతానికి పైగా ప్లాంట్లు ఈ జిల్లాల్లోనే అధికంగా ఉన్నాయి. అదే విధంగా అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ కడప, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న కారణంగా ఆయా ప్రాంతాల్లో సోలార్‌ పార్క్‌ ఏర్పాటు చేసి అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 
 
ఈ నేపథ్యంలో  ఏపీ గ్రీన్‌ ఎనర్జీ సోలార్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కు 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 100 శాతం సబ్సిడరీగా ఏపీ జెన్‌ కోకి అనుబంధంగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ 15.02.2020న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీజీఈసీఎల్‌ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది.
 
సోలార్‌ ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తి చేసే విద్యుత్‌ ను 30 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తుంది. అనంతరం ఆ ప్లాంట్లను జెన్‌ కో పరమవుతాయి. ఏ రకమైన అదనపు పెట్టుబడి అవసరం లేకుండా రాష్ట్ర వినియోగంపై ఆర్థిక భారం తగ్గించే విధంగా పంపిణీ వ్యవస్థలు వినియోగం చేసుకుంటాయి.
 
ఏపీ డిస్కంలు విద్యుత్‌ కొనుగోలుకు వినియోగించే వ్యయం కంటే సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు ఖర్చు తక్కువ. ప్రస్తుతం ఏపీ డిస్కంలు కిలో వాట్‌ కు రూ.4.68 ఖర్చు చేస్తుండగా సోలార్‌ విద్యుత్‌ రేట్లు క్రమేపి తగ్గుకుంటూ వస్తున్నాయి.  వివిధ రాష్ట్రాల్లో దీనిపై వ్యయం రూ.1.99 పైసల నుండి రూ.2.43 పైసల వరకు ఉంది. సోలార్‌ విద్యుత్‌ వినియోగం ద్వారా మొత్తంగా 30 ఏళ్లలో దీని ద్వారా రాష్ట్రం 48,800 కోట్ల రూపాయలు ఆదా చేసే అవకాశాలున్నాయి.
 
 అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో అధికంగా బంజరు భూములు ఉండటం వల్ల సోలార్‌ ప్రాజెక్టుకు ఈ ప్రాంతాలు సరైనవని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 50 శాతం ప్రభుత్వ భూములను 5 రూపాయలకే లీజుకు ఇవ్వనుంది.

అదే విధంగా మిగిలిన 50 శాతం పంటలు పండని ప్రైవేట్, అసైన్డ్‌ భూములను సేకరించనుంది. వీటికి ఏడాదికి ఎకరాకు రూ.25 వేల చొప్పున లీజు చెల్లించనుంది. చివరగా సాగులేని భూములను వినియోగంలోకి తేవడం, 30 ఏళ్ల పాటు ప్రైవేట్‌ భూములకు ఆదాయం చెల్లించి ఆర్థిక ప్రయోజనాలతో పాటు పర్యావరణ, సామాజిక ప్రయోజనాలను కల్పించనుంది. 
 
వ్యవసాయానికి సోలార్‌ విద్యుత్‌ వినియోగం వాడటం వల్ల శిలాజ ఇంధనం వాడకం క్రమంగా తగ్గిపోనుంది. దీనివల్ల వాతావరణంలోకి విడుదలయ్యే 14 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను అరికడుతుంది. అదే విధంగా సోలార్‌ పార్కులు ఏర్పాటు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అంతేగాక స్థిరమైన విద్యుత్‌ సరఫరాకు వీలు కలుగుతుంది. 
 
రాష్ట్రంలో 10 సోలార్‌ పార్కుల ఏర్పాటు వల్ల 6400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగనుంది. అందులో భాగంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ఆల్ట్రా మెగా  సోలార్‌ పార్క్‌ లు చక్రాయపేట్, ఎం.కంబాలదిన్నె, పెండ్లిమర్రిలో ఏర్పాటుకానున్నాయి. 
 
కడప జిల్లాకు చెందిన  తొండూరు లో 400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ఆల్ట్రా మెగా  సోలార్‌ పార్క్‌ ఏర్పాటుకానుంది. ప్రకాశం జిల్లాలో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ఆల్ట్రా మెగా  సోలార్‌ పార్క్‌ లు రుద్రసముద్రం, సీఎస్‌ పురంలో ఏర్పాటుకానున్నాయి. 
 
అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ఆల్ట్రా మెగా  సోలార్‌ పార్క్‌ లు ఉరుచింతల, మదిగుబ్బలో ఏర్పాటుకానున్నాయి. 1200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ఆల్ట్రా మెగా  సోలార్‌ పార్క్‌ కంబదూర్‌ లో ఏర్పాటుకానుంది. కర్నూలు జిల్లాలో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ఆల్ట్రా మెగా  సోలార్‌ పార్క్‌ కొలిమిగుండాలలో ఏర్పాటుకానుంది. 
 
ఎం.ఎన్‌.ఆర్‌.ఇ. మార్గదర్శకాల ప్రకారం పీపీఏ పీరియడ్‌ 30 ఏళ్లుగా నిర్ణయించారు. ఇది వాణిజ్యంగా ఉత్పత్తి తయారీ ప్రారంభించిన తేదీ నుంచి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు అమల్లో ఉంటాయి. అనంతరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరం అవుతాయి.
 
 పీపీఏ అమల్లో ఉన్న కాలంలో 18 శాతానికి సామర్థ్య వినియోగం (కెపాసిటీ యుటిలైజేషన్‌ ఫ్యాక్టర్‌) తగ్గకూడదు. కోట్‌ చేసిన బిడ్‌ పార్ట్‌ నర్‌ తీసుకోవడం జరుగుతుంది. బిడ్‌ రెండు దశల్లో లెక్కిస్తారు. మొదటి దశలో సాంకేతిక, వాణిజ్య పరంగా, రెండో దశలో ఈ–రివర్స్‌ ఆక్షన్‌ లో గణిస్తారు.బిడ్‌ ప్రాసెస్‌ టెండర్‌ నోటీస్‌ నవంబర్‌ 31,2020న ఇవ్వగా ఫిబ్రవరి 2021కి ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
 
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన రైతుభరోసా పథకం ద్వారా ఏటా రూ.13500 చొప్పున ఐదేళ్ల పాటు అందించి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. దీంతో పాటు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్, విత్తన సబ్సిడీ, వడ్డీలేని రుణాలు, వైఎస్సార్‌ సున్నావడ్డీ ద్వారా పంట రుణాలు వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయాధారిత పెట్టుబడులు సమకూర్చి సాగు ఖర్చు తగ్గించేందుకు రైతన్నకు చేయూతనిస్తోంది.

సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రైతులకు శాశ్వతంగా 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌కు పూర్తి భరోసా దక్కినట్లేనని చెప్పాలి. ఒకేసారి 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పడంతో రాష్ట్ర రైతుల వ్యవసాయ అవసరాలకు తొలిసారిగా సౌర విద్యుత్తు భారీస్థాయిలో అందుబాటులోకి రానుంది.