సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (19:18 IST)

తెలంగాణ ఓ కుటుంబ పాలనతో దోపిడీకి గురవుతుంది : ప్రధాని మోడీ

pmmodi
తెలంగాణ రాష్ట్రం ఓ కుటుంబ పాలనతో దోపిడీకి గురవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆయన గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఇండియన్ బిజినెస్ స్కూల్ ద్వి దశాబ్ద వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు రాగా, ఆయనకు అధికారులు, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ శ్రేణులతో ఆయన ఓ చిన్నపాటి సమావేశం నిర్వహించారు. 
 
ఇందులో ఆయన తెరాస అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు పట్టుదలకు, పౌరుషానికి మారుపేరన్నారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగం చేసిన ఘనత తెలంగాణ గడ్డకు వుందన్నారు. అయితే, ఏ ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదని గుర్తుచేశారు. 
 
ఎంతో మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం ఇపుడు ఒక కుటుంబం ఆధీనంలో ఉందని, కుటుంబ పాలన సాగుతోందంటూ మండిపడ్డారు. ఆ కుటుంబం అధికారంలో ఉంటూ దోచుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కుటుంబ పార్టీ స్వలాభం ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయాలు నెరవేరలేదన్నారు. తెలంగాణ యువత ఆశయాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఒక కుటుంబ దోపిడికీ తెలంగాణ బలవుతోందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అదేసమయంలో మున్ముందు తెలంగాణాలో మార్పు తథ్యమని, ఇటీవల జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణాలో కొత్త చరిత్ర సృష్టిస్తామని, కాషాయ జెండా ఎగురవేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెరాస అబద్ధాలు చెప్పే పార్టీ.. బీజేపీ గెలిచే పార్టీ అంటూ నినాదం చేశారు.