1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (07:08 IST)

నేడు సీఎం కేసీఆర్ బెంగుళూరు పయనం - 27న తిరిగిరాక

cmkcr
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం బెంగుళూరుకు వెళుతున్నారు. తాను చేపట్టిన జాతీయ స్థాయి పర్యటనలో భాగంగా ఆయన గురువారం బెంగుళూరుకు చేరుకుంటారు. ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అవుతారు. అనంతరం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. 
 
జాతీయ రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వచ్చేస్తారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఎలాంటి ప్రకటన జారీ చేయకపోయినా.. ఈనెల 18న జారీ చేసిన జాతీయ స్థాయి పర్యటన వివరాల మేరకు కేసీఆర్‌ 26న బెంగళూరు వెళ్లనున్నారని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి. 
 
నిజానికి, అప్పట్లో విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం 26న బెంగళూరు వెళ్లి.. అక్కడి నుంచే 27న మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్దికి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలుస్తారని ప్రకటించింది. కానీ.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తారని, ఇక్కడి నుంచే 27న రాలేగావ్‌ సిద్దికి వెళ్లే అవకాశాలున్నాయని సీఎంవో వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఆయన హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టకముందే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని వీడి బెంగుళూరుకు వెళుతున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ల మధ్య దూరం బాగా పెరిగిపోయిన విషయం తెల్సిందే.