1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (07:57 IST)

నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ రాక - భారీగా ఏర్పాట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరే ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆయనకు స్వాగతం పలకాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకంటే ముందుగానే హైదరాబాద్ నగరాన్ని వీడి బెంగుళూరుకు వెళ్ళిపోనున్నారు. 
 
ప్రధాని హైదరాబాద్ పర్యటన ముగించుకుని అక్కడ నుంచి నేరుగా చెన్నైకు బయలుదేరి వెళతారు. ఆ తర్వాత కొన్ని గంటలకే సీఎం కేసీఆర్ బెంగుళూరు నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ప్రధాని హైదరాబాద్ నగరాన్ని వీడిన తర్వాత సీఎం కేసీఆర్ భాగ్యనగరిలో అడుగుపెట్టనున్నట్టు తెరాస వర్గాల సమాచారం. 
 
గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ మధ్య అంతరం బాగా పెరిగింది. ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చారు. దానికి సీఎం కేసీఆర్‌ రావద్దంటూ పీఎంవో నుంచి తమకు సందేశం వచ్చిందని ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దీనిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఖండించారు కూడా. 
 
ఇక, సమతా మూర్తి శిలా ఫలకంపైనా కేసీఆర్‌ పేరు పెట్టలేదు. దాంతో, శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలకలేదు. వీడ్కోలు కూడా చెప్పలేదు. అప్పటి నుంచే పీఎం, సీఎం మధ్య పొరపొచ్చాలు ప్రారంభమయ్యాయని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అప్పటి నుంచి ప్రధానిని కలిసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం లేదు. 
 
ఇప్పుడు మరోసారి ప్రధాని నగరానికి వస్తున్నా.. పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ద్విదశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్‌ రానున్నారు. నగరంలో రెండున్నర గంటలపాటు ఆయన పర్యటన సాగనుంది. 
 
మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లుచేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితరులు ప్రధానిని ఘనంగా సన్మానించనున్నారు. 
 
విమానాశ్రయంలోనే దాదాపు 15 నిమిషాలపాటు పార్టీ కార్యకర్తలను మోడీ కలుసుకునే అవకాశం ఉంది. తర్వాత 1.50 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సెంట్రల్‌ వర్సిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఐఎస్‌బికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల వరకు ఐఎస్‌బి ద్వి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఐఎ‌స్‌బీ ఆవరణలో మొక్క నాటనున్నారు. 
 
విద్యార్థులను ఉద్దేశించి 35 నిమిషాలపాటు ప్రసంగించనున్నారు. అనంతరం, సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుని చెన్నై బయలుదేరి వెళతారు. అక్కడ ఐదు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ప్రధాని పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాలకు 5 కి.మీ.ల పరిధిలో డ్రోన్లు, రిమోట్‌ కంట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్టులను ఎగురవేయడాన్ని నిషేధించారు.