ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (19:27 IST)

భారతీయులందరికీ గర్వకారణం పివి సింధు: గవర్నర్ బిశ్వభూషన్

ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ పివి సింధు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా, భారతీయులందరికీ గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ తెలిపారు. ప్రపంచ క్రీడా చిత్రపటంపై భారతదేశాన్ని నిలపటంలో ఆమె అందించిన సేవలు ఎనలేనివన్నారు. శుక్రవారం విజయవాడలోని రాజ్ భవన్ దర్బార్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ సింధును ఘనంగా సత్కరించారు. 
 
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సింధు ఛాంపియన్‌షిప్ గెలిచిన తరువాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా తాను ఆమెను కలిసి అభినందనలు అందించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఆమెను సత్కరించడం, ఇలా రాజ్ భవన్‌లో కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు.
 
ఫైనల్ మ్యాచ్‌లో సింధు అసాధారణమైన ప్రదర్శన కనబరిచి, ప్రత్యర్థిపై ఛాంపియన్‌షిప్ గెలిచారని, ఆ ఫలితం కోసం యావత్ భారతదేశం ఎంతో ఆసక్తితో వేచి చూసిందని గవర్నర్ తెలిపారు. సింధు తల్లిదండ్రులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందిస్తూ, కోచ్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, మద్దతు కూడా ఛాంపియన్‌షిప్ గెలవడంలో ఆమెకు సహాయపడిందని, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవాలని గవర్నర్ శ్రీ హరిచందన్ అశాభావం వ్యక్తం చేసారు. 
 
ఈ నేపధ్యంలో సింధును శాలువ మరియు జ్ఞాపికతో బహుకరించిన బిశ్వభూషన్ హరిచందన్ ఆమె మరిన్ని పురస్కారాలను అందుకోవాలన్నారు. సింధు స్పందిస్తూ ఎపి రాజ్ భవన్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని, గవర్నర్ నుంచి సత్కారం అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. దేశ ప్రజల ఆశీర్వాదంతో మరింతగా కృషి చేసి మరిన్ని విజయాలు సాధించగలనన్న ధీమాను వ్యక్తం చేసారు.  
 
తొలుత పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు మాట్లాడుతూ పి.వి. సింధు తెలుగు ప్రజల విజయంగా అభివర్ణించారు. ఆమెకు భవిష్యత్ ప్రయత్నాలలో మరిన్ని విజయాలు సమకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ, క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఎపి స్పోర్ట్స్ అథారిటీ ఎండి కాటమనేని భాస్కర్, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి అర్జున రావు తదితరులు పాల్గొన్నారు. 
 
మరోవైపు గవర్నర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడ నగరానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీడా స్పూర్తికి ప్రతీకగా నిలిచారు.