కుల, ఆదాయ, నివాస ధృవీకరణకు సంబందించి ఒకే సర్టిఫికెట్
ఏపీలో కుల, ఆదాయ, నివాస ధృవీకరణకు సంబందించి ఒకే సర్టిఫికెట్ అయిన ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల మంజూరులో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం లాగిన్ ప్రక్రియలో మార్పులను తీసుకురావాలని భావిస్తోంది.
ఇందుకోసం ప్రస్తుతం అమలవుతున్న విధానానికి స్వస్తి చెప్పి, పాత విధానంలో లాగిన్‌ను అమలు చేస్తే త్వరిత గతిన సర్టిఫికెట్లు మంజూరు చేయవచ్చని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం అమలవుతున్న విధానంలో సర్టిపికెట్లు అవసరమైన వారు తొలుత మీ సేవ లేక గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు తహసీల్థార్ కు అక్కడి నుండి ఎంఆర్‌ఓ లాగిన్‌లకు వెడుతుంది.
అప్పుడు దానిని విచారణ కోసం విఆర్‌ఓ లేక ఆర్‌ఐకి అప్పజెబుతారు. విచారణ పూర్తయిన అనంతరం అప్రూవల్ కోసం తహసీల్దార్‌కు పంపిస్తారు. సర్టిఫికెట్ మంజూరు చేయాలా లేక తిరస్కరించాలా అనేది ఎమ్మార్వో నిర్ణయం తీసుకుంటారు.
ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో దీనికి అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని రెవిన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు వచ్చిన సూచనలతో ప్రతిపాదించిన నూతన విధానంలో సర్టిఫికెట్లు అవసరమైన అభ్యర్థులు తమ దరఖాస్తును తొలుత గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ లేక మీసేవ కియోస్క్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అనంతరం క్షేత్ర స్ధాయి విచారణ ను గ్రామ రెవెన్యూ సెక్రటరీ లేక వార్డు రెవెన్యూ సెక్రటరీ చేపడతారు. విచారణ పూర్తి కాగానే రెవెన్యూ ఇనెస్పెక్టర్ ప్రాసెస్ చేస్తారు. తహసీల్ధార్ దరకాస్తులను అప్రూవల్ చేయాలా లేక తిరస్కరించాలా అనేది నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు సమాచారం.
బిసి, ఎస్సీ, ఎస్టీలు కుల సర్టిఫికెట్లు, నేటివిటీ, పుట్టినరోజు, కమ్యూనిటీ, ఆదాయ సర్టిఫికెట్‌లతో పలు పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు తప్పనిసరి. ముఖ్యంగా విద్యార్థులకు స్కాలర్ షిప్పు, ఫీజు రీ ఎంబర్స్‌్‌మెంట్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పధకాలు పొందడంలో ఈ సర్టిఫికెట్లు కీలకం.