సిగరెట్ తెచ్చిన తంటా.. ఆరగంట ఆగిన వందే భారత్ రైలు.. ఎక్కడ?
కొందరు అకతాయిలు చేసే పనులు వినేందుకు నవ్వు తెప్పించేలా ఉన్నప్పటికీ, ఆందోళనకరంగా ఉంటాయి. మరికొన్నిసార్లు పెను ముప్పుకు దారితీస్తుంటాయి. తాజాగా పొగరాయుడు చేసిన పనికి వందే భారత్ రైలు అరగంట పాటు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది బుధవారం సాయంత్రం జరిగింది. సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు అరగంట నిలిపివేశారు.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ రైలులో నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ వద్దకు రాగానే రైలులోని ఓ బోగీ నుంచి పొగలు వచ్చాయి. దీన్ని రైల్వే సిబ్బంది గుర్తించి రైలును ఆపివేసి ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. ఆ తర్వాత పొగలు వచ్చిన బోగీలో సిబ్బంది తనికీ చేశారు.
అయితే, ఆ బోగీలో కాల్చిపడేసిన సిగరెట్ ముక్క ప్లాస్టిక్ సామాగ్రికి అంటుకోవడంతో పొగ వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఈ ఘటనకు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కారకుడిగా గుర్తిచి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బోగీలో చెలరేగిన మంటలను పూర్తిగా ఆర్పివేసిన తర్వాత రైలు బయలుదేరి వెళ్లింది. ఈ కారణంగా ఓ అరగంట పాటు రైలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది.