శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (09:46 IST)

ప్రాణాపాయస్థితిలో తితిదే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు చెందిన స్నేక్ చాచర్ (పాములు పట్టే ఉద్యోగి) భాస్కర్ నాయుడు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇటీవల ఓ కాలేజీలో ఆయన పామునుపడుతున్న సమయంలో అది అదుపు తప్పి ఆయన చేతిపై కాటేసింది. అది అత్యంత విషపూరిత పాము కావడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 
 
కాగా, ఇప్పటివరకు కొన్ని వేల పాములను పట్టిన భాస్కర్ నాయుడు.. ఆ పాములకు ప్రాణం కూడా పోశాడు. ఇపుడు అవే పాము కాటుకు గురై ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఒకవైపు పాము కాటు, మరోవైపు డెంగీ జ్వరం సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 
పైగా, ఆయనకు ప్లేట్ లెట్స్ బాగా తగ్గిపోయినట్టు ఆయనకు వైద్యం చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం భాస్కర్ నాయుడుకి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తిరుమల, తిరుపతిలో విష సర్పాల నుంచి స్థానికులతో పాటు భక్తులను భాస్కర్ నాయుడు రక్షిస్తూ వచ్చిన విషయం తెల్సిందే.