బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:19 IST)

కాలికి గాయం అయినా... స్పంద‌న ఆప‌ని ఎస్పీ సిద్దార్ద్

ఉన్నతాధికారులంటే... కింద స్థాయి అధికారుల‌కు ప‌ని అప్ప‌గించి... తాము కొంత రిలాక్స్ కావ‌చ్చు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అయితే, ఇది ఇంకా సులువు. కానీ, కృష్ణా ఎస్పీ త‌న కాలికి ద‌బ్బ‌త‌గిలినా, 
అంకితభావంతో వృత్తి నిబద్ధతని ప్రదర్శిస్తూ ఆదర్శంగా నిలిచారు.
 
నీరసంగా ఉంటే సెలవుపై ఇంట్లో గడపాలి అనుకునే ఉద్యోగులున్న నేటి రోజులలో  ప్రజా సమస్యల పరిష్కార‌మే ధ్యేయంగా జిల్లా ఎస్.పి సిద్దార్డ్ కౌశిల్ ప‌నిచేస్తున్నారు. రెండు రోజుల కిందట ఎస్పీ కాలికి గాయమై విశ్రాంతి  తీసుకోవాల్సిన సమయంలో కూడా, అవిశ్రాంతంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రతి రోజు స్పందన కార్యక్రమాన్ని వినూత్నంగా కృష్ణాలో ప్రారంభించిన ఆయ‌న దానికి విఘాతం క‌ల‌గ‌కుండా, ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నారు. 
 
తన కాలి గాయంపై ఏమాత్రం దృష్టి పెట్టక,అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రతిరోజు స్పందన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ప‌నిచేస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజలను  తన నివాస స్థలంలోనే కలిసి, తన గాయం బాధను సైతం ఖాతరు చేయకుండా ప్రజా సమస్యలను విని, వాటిపై సానుకూలంగా స్పందించి, సత్వర న్యాయం అందిస్తున్నారు.
 
ప్రతిరోజు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు రాగా, వారందరితో ఎస్పీ గారు ముఖాముఖి సంభాషించి వారి సమస్యలను తెలుసుకొని, వారి సమస్యలపై చట్టప్రకారం తగు విచారణ జరిపి పూర్తి న్యాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
 
కృష్ణా రావు పేట నుండి పద్మ అనే మహిళ తన భర్త 20 సంవత్సరాల క్రితం మరణించగా, మరిది మాకు  గల నివాస   స్థలాన్ని ఆక్రమించుకొని మాపై దాడికి పాల్పడుతున్నారని తనకు న్యాయం చేయమని ఎస్పీ గారిని ఆశ్రయించింది. ఆ ఫిర్యాదు విని ఎస్పీ గారు సంబంధిత అధికారికి బదిలీ చేసి దీనిపై చట్ట ప్రకారం పూర్తి విచారణ జరిపి తగు న్యాయం చేయవలసిందిగా ఆదేశించారు.
 
ముదినేపల్లికి చెందిన మహిళ తనకు వివాహం జరిగి ఏడు సంవత్సరాలు కాగా, తన భర్త దుర్వ్యసనాలకు అలవాటు పడి, స్త్రీ వ్యామోహంలో పడి తనను తన ఇద్దరు పిల్లలను తీవ్ర ఇబ్బందులు పెడుతూ మానసికంగా శారీరకంగా దాడికి పాల్ప డుతున్నారని తనకు న్యాయం చేయమని ఎస్పి గారికి ఫిర్యాదు చేసింది. దీనిపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.