ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు: పిల్లలను దత్తత తీసుకుంటే 180 రోజులు సెలవు
ఏపీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. 11వ పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) సిఫార్సుల ఆధారంగా పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షమీర్ సింగ్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చు. పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఒంటరి (అవివాహితుడు, విడాకులు పొందిన వారు, భార్య చనిపోయిన వారు) పురుషులకూ వర్తిస్తుంది.
వికలాంగులైన ఉద్యోగులు తమ కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ సెలవులను పొందవచ్చు. హైరిస్క్ వార్డుల్లో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ సెలవులు తీసుకోవచ్చు. ఇక ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.