శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2016 (09:19 IST)

సోషల్ మీడియాతో పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం.. బీజేపీకి చెక్ పెట్టేందుకేనా?

సోషల్ మీడియాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. సోషల్ మీడియా మోజులో ఉన్న యువతరాన్ని తనవైపు తిప్పుకునేందుకు ట్విట్టర్‌ను పవన్ కల్యాణ్ అస్త్రంగా చేసుకున్నారు. గతంలో ఆయన నాలుగైదు

సోషల్ మీడియాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. సోషల్ మీడియా మోజులో ఉన్న యువతరాన్ని తనవైపు తిప్పుకునేందుకు ట్విట్టర్‌ను పవన్ కల్యాణ్ అస్త్రంగా చేసుకున్నారు. గతంలో ఆయన నాలుగైదు సందర్భాల్లో ప్రజల్లోకి వచ్చి బహిరంగ సభల్లో పాల్గొన్నప్పటికీ, ఆయన ఉపన్యాసాల ప్రభావం అంతంత మాత్రంగానే వుందని, కానీ సోషల్ మీడియాలో పవన్ స్పందనకు మాత్రం భారీ స్పందన లభిస్తోందని టాక్ వస్తోంది. 2019 ఎన్నికలను టార్గెట్ చేసుకున్న పవన్ కల్యాణ్.. ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయంగా ఎదిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. 
 
ఎన్నికలు దగ్గర పడుతున్నాయనో.. లేక మరేదైనా కారణమోగానీ పవన్ స్టార్ స్పీడ్ పెంచారని రాజకీయ వర్గాల్లో టాక్. తాజాగా పెద్దనోట్ల రద్దు వివాదంతోపాటు వివిధ అంశాలపై ఐదు విడతలుగా పవన్ ట్విట్టర్ సందేశాలు విడుదల చేస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై గురిపెట్టిన పవన్, నోట్ల రద్దు అంశంపై నిశిత విమర్శలు చేశారు. కొంతకాలంగా పవన్ ట్విట్టర్‌ను వేదికగా చేసుకుని తనదైన అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తున్నారు.
 
పైగా సినిమాలతో తనకున్న సంబంధ బాంధవ్యాలను వదలకుండా రాజకీయ ప్రయాణం కూడా కొనసాగించడానికి సోషల్ మీడియా  పవన్‌కు బాగానే ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల పవన్ ట్విట్టర్‌లో పెంచినజోరు.. అందులో చేస్తున్న ఘాటైన విమర్శలు, రాబోయేకాలంలో ఆయన బీజేపీకి వ్యతిరేకంగా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తారనే సంకేతాలు ఇస్తున్నట్లు తేలిపోయింది. ఇప్పటికే పవర్ స్టార్ మీద కమలం సార్లు విరుచుకుపడడం కూడా మొదలైంది. మరి ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా పవన్ ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది చర్చనీయాంశమైంది.