ఎట్టకేలకు ముక్కంటీశ్వరుని ఆలయాన్ని తెరిచారు, రేపటి నుంచి భక్తులు వెళ్ళొచ్చు
హరహర మహదేవ శంభోశంకర.. ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయాన్ని ఎట్టకేలకు తెరిచారు. గత 80 రోజుల నుంచి ఆలయం మూతపడి ఉండడం.. అందులోను ఆలయం రెడ్ జోన్లో ఉండడంతో దేవదాయశాఖ ఆలయాన్ని మూసే ఉంచాలని ఆదేశించింది.
ఆలయాన్ని గ్రీన్ జోన్లోకి మార్చినా... ఆ తరువాత ఆలయంలో పనిచేసే పూజారికి పాజిటివ్ రావడంతో మళ్ళీ ఆలయాన్ని తెరవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకున్నారు. అయితే ఎట్టకేలకు ఆలయంలో శాంతిహోమం నిర్వహించారు పండితులు. పండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఆలయం మారుమ్రోగింది.
నిన్న, ఈరోజు మధ్యాహ్నం వరకు ఆలయ పండితులు శాంతి హోమాన్ని నిర్వహించారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, స్థానికులను ఆలయంలోకి దర్సనానికి అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. రేపటి నుంచి సామాన్య భక్తులను దర్సనానికి అనుమతించనున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్సించుకోవచ్చు.