ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:15 IST)

ఏపీలో సర్కారు మద్యం షాపులు ప్రారంభం

నూతన నిబంధనల ప్రకారం నేటినుంచి జిల్లావ్యాప్తంగా 39 షాపుల్లో మద్యం విక్రయాలకు ఎక్సైజ్‌ అధికారులు సన్నద్ధం అయ్యారు. గుంటూరు డివిజన్‌లో 7, తెనాలి డివిజన్‌లో 20, నరసరావుపేట డివిజన్‌లో 12 షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి.

ఇకనుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు పని చేస్తాయి. ఆయా మద్యం షాపులకు పర్మిట్‌ రూమ్స్‌, లూజ్‌ సేల్స్‌ ఉండదు. అక్టోబరు 1 నుంచి మిగిలిన అన్ని షాపులు కలుపుకొని 282 షాపులలో మద్యం అమ్మకాలు జరుగనున్నాయి.

అయితే బార్ల లైసెన్సులు మాత్రం 2022 వరకు ఎటువంటి మార్పు ఉండక పోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా షాపుల నిర్వహణకు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు హెల్పర్లను ఎక్సైజ్‌శాఖ అధికారులు ఔట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా తీసుకున్నారు.

ప్రస్తుతం ప్రైవేటు ఆధీనంలో ఉన్న షాపులకు పర్మిట్‌ రూమ్స్‌ ఉన్నాయి. నిబంధనల ప్రకా రం ఆ రూమ్‌లోనే మద్యం సేవించే అవకాశం ఉంది. గతంలో ఒక్కో వ్యక్తి ఆరు మద్యం బాటిళ్ళు విక్రయించే వారు. దానిని మూడు బాటిల్స్‌కు కుదించారు. ఎవరి వద్ద అయినా అంతకు మించి మద్యం బాటిల్స్‌ అధికంగా ఉంటే అతనిపై కేసు నమోదు చేస్తారు.
 
ప్రభుత్వ నూతన మద్యం పాలసీ అమల్లో భాగంగా లూజ్‌సేల్స్‌, పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. ఎమ్మార్పీ ఉల్లంఘన పూర్తిగా నిషేధం. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మద్యం అమ్మకాలు చేపడతారు.