దురదృష్టం కొద్దీ ప్రజాస్వామ్య పద్దతిలో వైకాపా పవర్‌లోకి వచ్చింది.. అలాగనీ చూస్తూ ఊరుకోం...
ఏపీలోని వైకాపా ప్రభుత్వంపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దురదృష్టం కొద్దీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో వైసీపీ రాజ్యాధికారంలోకి వచ్చింది కనుక, చేయగలిగిందేమీ లేదు కానీ, ప్రజలకు అండగా బీజేపీ ఉందని హామీ ఇచ్చారు.
'ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి. వాళ్లు (వైసీపీ) కనుక పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం గానీ, భారతీయ జనతా పార్టీ గానీ చూస్తూ ఊరుకోవడం జరగదు' అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లను రద్దు చేయొద్దని కేంద్రం చెబుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, 'గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతున్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించే విధానం కాదు' అని ధ్వజమెత్తారు.
అంతేకాకుండా, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజకీయాలన్నీ కూడా రెండు కుటుంబాల మధ్యేనని అన్నారు. 1995 తర్వాత నుంచి ఇప్పటి వరకూ కూడా చంద్రబాబునాయుడు కుటుంబం వర్సెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీదుగా రాజకీయాలు నడిచాయని, ఒక సిద్ధాంత పరంగా రాజకీయాలు నడవలేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏం తేడా లేదని, వలసపక్షుల్లా అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటూ పార్టీలు మారుతూ వచ్చారని అన్నారు.
ఇక, మన రాష్ట్ర పరిస్థితి చూస్తే.. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. 'రివర్స్'తో మిగిలే సొమ్ముకంటే ప్రాజెక్టు పనుల జాప్యం వల్ల జరిగే నష్టం ఎక్కువ అని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీ సహా ప్రాంతీయపార్టీలతో రాష్ట్రానికి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ అని సుజనా చౌదరి జోస్యం చెప్పారు.