అనుచరుల కోసం పార్టీ మారిన ఆదినారాయణ రెడ్డి.. టీడీపీ షాక్

adinarayana reddy
ఠాగూర్| Last Updated: సోమవారం, 21 అక్టోబరు 2019 (14:09 IST)
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో కీలక నేతగా చెలామణి అయిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ మరుక్షణమే ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పిన నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, 2014లో జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలకంగా వ్యవహరించారు.

ఆటు పిమ్మట 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అదేసమయంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. పార్టీ అనుచరుల కోసం పార్టీ మారాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటా గతంలో వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో ఇటీవల బీజేపీలో చేరేందుకు ఓసారి ఢిల్లీ వెళ్లారు. కొన్ని కారణాల వల్ల అప్పట్లో చేరలేకపోయారు. అయితే సోమవారం నాడు ఢిల్లీ వేదికగా జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పేసుకున్నారు. కాగా కడప జిల్లాలో టీడీపీ కీలకనేతగా ఉన్న ఆది బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లైంది.దీనిపై మరింత చదవండి :