సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (12:33 IST)

జగన్‌ని టార్గెట్ చేసిన బిజెపి... ఎందుకంటే?

స్థానిక సంస్ధల ఎన్నికలు  రాబోతున్నాయి. ఎపిలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. అయితే ప్రధాన ఎన్నికల్లో తమకు తిరుగులేని విజయం రావడంతో స్థానిక సంస్ధల ఎన్నికల్లో కూడా విజయం మాదేనన్న ధీమాలో ఉన్నారు అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే గత నాలుగు నెలల్లో ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలే తమ పార్టీ గెలుపుకు దోహదపడుతుందన్న నమ్మకంతో ప్రతిపక్ష టిడిపి నేతలు ఉన్నారు.
 
అయితే కేంద్రంలో చక్రం తిప్పుతున్న బిజెపి ఎపి ఎన్నికలపై దృష్టి పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్థమైంది. అంతేకాదు పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు సై అంటోంది. ప్రతిపక్ష టిడిపిని అస్సలు పరిగణలోకి తీసుకోని బిజెపి నేతలు వైసిపినే టార్గెట్ చేశారు. అందులోను జగన్మోహన్ రెడ్డిపై విమర్సల వర్షం ప్రారంభించారు. ఇప్పటికే టిడిపి, జనసేన పార్టీల నుంచి బిజెపిలోకి కొంతమంది నేతలు వెళుతున్నారు.
 
ఆ నేతలతోనే పార్టీని పటిష్టం చేసి స్థానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేయాలన్నది బిజెపి ఆలోచన. తిరుపతిలో పర్యటించిన బిజెపి జాతీయ కార్యదర్సి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎపిలో అవినీతి.. కుటుంబ పాలన కొనసాగుతోందని.. రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వంతో విసిగిపోయారంటూ ధ్వజమెత్తారు. 
 
ఒకవైపు జగన్ పైన విమర్సలు చేస్తూనే మరోవైపు స్థానిక సంస్ధల ఎన్నికల్లోను, ప్రధాన ఎన్నికల్లోను పోటీ చేస్తామని ప్రకటించారు. వేగం పుంజుకొంటున్న బిజెపిని చూస్తే వైసిపి నేతల్లో వణుకు పుడుతోందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో బిజెపి చక్రం తిప్పుతోంది కాబట్టి బిజెపి నేతలను వైసిపి నాయకులు ఎదుర్కొనే పరిస్థితి ఉండదంటున్నారు. మరి చూడాలి బిజెపిని ఎపిలో ఏ విధంగా పటిష్టం చేసి ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళతారన్నది.