శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేడు ఏపీ సర్కారు తెచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంలో విచారణ

supreme court
రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ జీవోను ఏపీ హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ ఎత్తివేయాలని కోరుతూ ఏపీలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై అపెక్స్ కోర్టులో గురువారం విచారణ జరుగనుంది. 
 
కాగా, ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 1 వివాదాస్పదమైంది. ఈ చీకటి జీవోపై విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా, ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. 
 
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ప్రభుత్వం తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది ఏపీ సర్కారు అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపేందుకు సమ్మతించింది.
 
మరోవైపు ఈ పిటిషన్‌పై ఏదేని ఆదేశాలు జారీచేసే ముందు తమ వాదనలు కూడా ఆలకించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అపెక్స్ కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇపుడు జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ నెల 23వ తేదీన ఏపీ హైకోర్టులో ఈ జీవో నంబర్ 1పై విచారణ విచారణ జరుగనుంది.