శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (15:23 IST)

కందుకూరు మృతులకు ఆర్థిక సాయం పెంపు.. సీఎం జగన్ కూడా...

chandrababu
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా ప్రకటించిన ఆర్థిక సాయం మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. బుధవారం రాత్రి ఈ అపశృతి చోటుచేసుకోగా, గురువారం ఉదయానికి ఈ మృతుల సంఖ్య 8కి చేరింది. ఈ మృతుల కుటుంబాలకు చంద్రబాబు తొలుత రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత ఈ సాయాన్ని రూ.15 లక్షలకు పెంచారు. అలాగే, పార్టీ నేతలు కూడా రూ.8 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఒక్కో మృతిని కుటుంబానికి టీడీపీ తరపున గరిష్టంగా రూ.23 లక్షల ఆర్థిక సాయం అందింది. ఈ చెక్కులను చంద్రబాబు స్వయంగా మృతుల కుటుంబాలకు అందజేశారు. 
 
మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటంబాలకు సానుభూతిని తెలిపారు. అలాగే, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 
 
అదేవిధంగా పవన్ కళ్యాణ్ సైతం తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని, అంటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మహతు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.