బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:34 IST)

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు?

టీడీపీతో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తు బంధం తెంచుకున్నా, కిందిస్థాయిలో మాత్రం వారి స్నేహం కొనసాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీ జీవీఎల్ టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, గ్రామ స్థాయిలో మాత్రం టీడీపీ-బీజేపీ-జనసేన  కలసిమెలసి రాజకీయంగా అడుగులు వేస్తున్న వైచిత్రి పంచాయితీ ఎన్నికలు ఆవిష్కరిస్తున్నాయి.

ఇది ఒకరకంగా రాష్ట్ర-పార్టీ జాతీయ నాయకత్వాలకు శరాఘాతమే. అంటే జాతీయ నాయకత్వం- కింది స్థాయి కార్యకర్తల ఆలోచనకు ఎక్కడా పొంతన కుదరడం లేదన్నది స్పష్టమవుతోంది.
 
పంచాయితీ ఎన్నికల రెండవ దశలో కూడా, టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. నామినేషన్లు వేసేందుకు వైసీపీ నేతలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నా, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటనలు చేయడం మినహా,  ఎలాంటి సాయం చేయలేకపోతోంది. అగ్రనేతలంతా ప్రెస్‌మీట్లకు, వీడియోలకు, టీవీ చర్చలకు పరిమితమయ్యారు.

ప్రతిపక్షాల మాదిరిగా జిల్లా ఎస్పీలు, డీజీపీ, ఎస్‌ఈసీని కలసి ఫిర్యాదు చేయడానికి దూరంగా ఉన్నారు. దానితో ఈ మూడు పార్టీల నేతలు..  స్థానికంగా తమలో ఎవరికి బలం ఉంటే, వారు పోటీ చేస్తూ మిగిలిన రెండు పార్టీల సాయం తీసుకుంటున్నారు. తొలి దశ ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ-బీజేపీ, మరికొన్ని చోట్ల టీడీపీ-జనసేన బరపరచిన అభ్యర్ధులు ఒక అవగాహనతో కలసిపోటీచేశారు. రెండవదశ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.
 
స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్, గతంలో ఆయన పోటీ చేసి ఓడిన కడియం నియోజకవర్గంలో అయితే.. మూడు పార్టీల కార్యకర్తలు కలసి ప్రచారం నిర్వహించడం, రాజకీయ వర్గాలను విస్మయపరిచింది.

టీడీపీ-బీజేపీ-జనసేన అభ్యర్ధులు ఏకంగా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, వాటిపై మోదీ-పవన్-సోము వీర్రాజు-గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఫొటోలు ఏర్పాటుచేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. గత ఎన్నికల ముందు విడిపోయిన ఈ పార్టీలు, మళ్లీ రెండేళ్లకు కలసి పోటీ చేస్తుండటమే విశేషం.