ఆ ఎన్నికల్లో కన్నాను ఓడించేందుకు శతవిధాలుగా ప్రయత్నించాం : చంద్రబాబు
ఇటీవల బీజేపీ రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు టీడీపీ కండువా కప్పిన ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నాపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. కన్నా హుందాతనం ఉన్న నేత, ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. అలాంటి నేత తమ పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. కన్నాను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.
గతంలో ఒకసారి పెదకూరపాడులో కన్నా పోటీ చేస్తే ఆయనను ఓడించేందుకు అన్ని విధాలుగా కష్టపడ్డామన్నారు. ఆయన ఉన్నంతవరకు ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించలేక పోయామని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయాల్లో ఆయనను చూశాను.. అసెంబ్లీ వేదికగా చూశాను, మాజీ మంత్రిగా, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడిగా చూశాను. విద్యార్థి దశ నుంచి అంచలంచెలుగా ఎదిగిన కన్నా... ఐదు పర్యాయాలు పాటు ఎమ్మెల్యేగా గెలిచారని ఆయన గుర్తుచేశారు.
గత 2004 నుంచి 2014 వరకు ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద క్యాబినెట్ మంత్రిగా పని చేశారని చెప్పారు. ఏ నాయకుడైనా సిద్దాంతపరంగా పని చేస్తే శాశ్వతంగా గుర్తింపు పొందుతారన్నారు. అలాంటి నేతల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరని, రాజకీయాల్లో హుందాతనం, నిబద్ధత, పద్ధతి ఉన్న నేత ఈ మాజీ మంత్రి కన్నా అని చంద్రబాబు అన్నారు. రాజకీయపరంగా విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని, కన్నాతో మాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు. కన్నాను ఇవాళ ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నామో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. సైకో పాలన పోవాలి.. సైకిల్ రావాలి అంటూ చంద్రబాబు ప్రసంగించారు.