సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (17:37 IST)

వేధించే నేతలు - అధికారుల పేర్లు రాసుకోండి... చంద్రబాబు

తెదేపా కార్యకర్తలను నాయకులను వేధించి, కష్టపెట్టిన వైకాపా నేతలను, అధికారుల పేర్లను నమోదు చేయండని తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలని చేస్తున్న రైతులకు మద్దతు పలకాలని కోరినందుకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కేసులు పెట్టగా జైలుపాలై విడుదలైన నందిగామకు చెందిన పలువురు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును కలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంచి కోసం పోరాటం చేయడంలో తప్పేముందన్నారు. ఆనాడు మహాత్మాగాంధీ స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని విజయం సాధించారని గుర్తుచేశారు. 

అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా తమరు నిరసన దీక్షలో పాల్గొన్నప్పుడు నందిగామలో 20 మందిని నిరసనదీక్ష చేశామని తెదేపా కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి వైకాపా నేతలు, పోలీసు అధికారులు తమపై కక్ష గట్టారని తెలిపారు. 
 
ఆ నేపథ్యంలో ఎంపీ నందిగం సురేష్ రావడం తాము రాజధానికి మద్దతు కోరడంతో అది సాకుగా కేసులు బనాయించారని పేర్కొన్నారు. జైలులో తమను తల్లిదండ్రులు సైతం కలవనీయకుండా అన్నపానీయాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారని తెలిపారు.

తమను అరెస్టు చేసిన ఎస్‌ఐని డీఎస్పీ కౌగిలించుకుని అభినందించారన్నారు. పోలీసు స్టేషన్ వద్ద సీసీ కెమెరాలను అమర్చి తమకోసం వచ్చే వారిపై నిఘా వేశారన్నారు. పోలీసు దుస్తుల్లో ఉండి వైకాపా కార్యకర్తలుగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

తమను అరెస్టు చేసినప్పటి తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకున్నారని తెలిపారు. పోలీసులు తమను అరెస్టు చేసిన తర్వాత స్టేషనులో డాన్స్ చేయడం ఆశ్చర్యం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వైకాపా నేతల అరాచకాలు మితిమీరాయని అయినా ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం పరితపించే ఎవరికైనా తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.