సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (15:52 IST)

బాబుతో భేటీకి డుమ్మా కొట్టిన కాపునేతలు... మూకుమ్మడిగా బీజేపీలోకి..?

తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలంతా మూకుమ్మడిగా కీలక నిర్ణయం తీసుకునే దిశగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఒక కళా వెంకట్రావు మినహా మిగిలినవారంతా కాషాయం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, బుధవారం చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన కాపు నేతల భేటీకి కళా వెంకట్రావు మినహా మిగిలిన వారిలో ఏ ఒక్కరూ రాలేదు. 
 
ఉండవల్లిలో కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, గత టీడీపీ సర్కారు నిర్మించిన ప్రజావేదికను సీఎం జగన్ ఆదేశంతో కూల్చివేశారు. అలాగే, ప్రజా వేదిక భవనానికి సమీపంలో ఉన్న చంద్రబాబు నివాసం కూడా ఉంది. ఇది కూడా అక్రమ నిర్మాణమేనని వైకాపా నేతలు అంటున్నారు. దీన్ని కూడా కూల్చివేయాలని అంటున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజావేదిక కూల్చివేతపై చర్చించారు. ఒకవేళ తాను ఉంటున్న భవనం కూల్చివేతకు ప్రభుత్వం ఉపక్రమిస్తే ఏం చేయాలన్న విషయమై నేతలతో చర్చించారు. ఈ భేటీకి కళా వెంకట్రావు, దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, కాల్వ శ్రీనివాసులు తదితరులు హాజరు కాగా, టీడీపీ కాపు నేతలు పలువురు గైర్హాజరు అయ్యారు.
 
ఇటీవల పార్టీ అధిష్టానానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాపు నేతలు కాకినాడలోని ఓ హోటల్‌లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు జరిగిన భేటీకి బోండా ఉమ, వేదవ్యాస్, జ్యోతుల నెహ్రూ, పంచకర్ల రమేశ్ తదితరులు డుమ్మా కొట్టారు. బోండా ఉమ అయితే  విజయవాడలో ఉండికూడా ఈ సమావేశానికి రాలేదు. ఈ నేపథ్యంలో కాపు నేతలంతా మూకుమ్మడిగా పార్టీని వీడి బీజేపీలో చేరుతారన్న వాదనలు ఊపందుకుంటున్నాయి.