మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (12:36 IST)

వివేకాను మూడు సార్లు చంపేశారు.. ఇపుడు వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు.. బీటెక్ రవి

btech
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డిని ఇప్పటివరకు మూడు సార్లు చంపేశారనీ, ఇపుడు ఆయన వ్యక్తిత్వాన్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత బీటెక్ రవి వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులోని నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారనీ, అందువల్ల ఆయన ఆగ్రహంతో వివేకా తలపై మూడుసార్లు దాడి చేసి చంపేశారంటూ వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. వివేకాను చిత్ర హింసలకు గురిచేసి చంపేసిన రక్త పిశాచాలు ఇప్పుడు ఆయన వ్యక్తిత్వంపైనా బురద జల్లుతున్నాయని బీటెక్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి గ్యాంగ్ నాలుక మడతేసినట్టు మరెవరూ వేసి ఉండరని, ఒలింపిక్స్‌లో నాలుక మడత పోటీలు పెడితే గోల్డ్ మెడల్స్ అన్నీ జగన్ రెడ్డి ముఠానే సొంతం చేసుకుంటుందన్నారు. గుండెపోటుతో మొదలైన మడత డ్రామా నాలుగేళ్లుగా అనేక అబద్ధాల చుట్టూ తిరుగుతోందన్నారు.
 
తొలుత గుండెపోటు అన్నారని, ఆ తర్వాత టీడీపీ నేతలే హత్య చేశారంటూ నారాసుర చరిత్ర అనే పుస్తకాలు కూడా రాశారని, ఆ తర్వాత అల్లుడే హత్య చేశాడన్నారని, అక్రమ సంబంధమని, ఆస్తి తగాదాలు కారణమన్నారని, ఇప్పుడు లైంగిక వేధింపులు అంటున్నారని మండిపడ్డారు. 
 
ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యకేసుపై సీబీఐ దర్యాప్తు అవసరమన్న జగన్మోహన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక అవసరం లేదని నాలుక మడతేశారని అన్నారు. వివేకా కుమార్తె పోరాటంతో సీబీఐ దర్యాప్తు జరుగుతుంటే ఆమెపైనా నిందలేస్తున్నారని బీటెక్ రవి ఆవేదన వ్యక్తం చేశారు.