1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (15:31 IST)

నెలలో 20 రోజులు ప్రజల్లో ఉండాలి.. యేడాదిలో ఎన్నికలు : సీఎం జగన్

jagan
వైకాపా ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం వర్క్ షాప్ నిర్వహించారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై సమీక్షలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో శాసనసభ్యులకు ఆయన కీలక ఆదేశాలు జారీచేశారు. ఇక నుంచి నెలలో 20 రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కోరారు. 
 
ఈ సందర్భంగా జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోపు ఎన్నికలు ఉండొచ్చని ఆయన చెప్పారు. సెప్టెంబర్‌ నాటికి ‘గడప గడపకు మన ప్రభుత్వం’, ఇతర కార్యక్రమాలు పూర్తిచేయాలని కోరారు. ఆగస్టు వరకు ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కొనసాగించాలని జగన్‌ సూచించారు. సెప్టెంబర్‌ నుంచి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 
 
ప్రజల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఈనెల 13 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై జగన్‌ స్పందించినట్లు తెలిసింది. ఆ ఓటర్లలో 80 శాతం మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సమీక్షకు పలువురు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు రాలేదు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విడదల రజిని హాజరుకాకపోవడం గమనార్హం.