సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (08:56 IST)

ఏపీలో టీడీపీ రాష్ట్ర బంద్ : తెదేపా ముఖ్య నేతల గృహ నిర్బంధం

టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్‎కు పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లాలో ఎక్కడకక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామమైన వెంకటాపురంకు భారీగా పోలీసులు చేరుకున్నారు. 
 
మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు మోహరించారు. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
 
అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటిముందు పోలీసులు మోహరించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జి మాధినేని ఉమామహేశ్వర నాయుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. 
 
అలాగే మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రాంమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు వైపీ.రమేష్, జిల్లా కార్యదర్శి తలారి సత్యప్ప, పట్టణ కన్వీనర్ మాదినేని మురళీని హౌస్ అరెస్ట్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో గొల్లపూడిలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేసి నున్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు, జగన్‌ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ఇప్పటికైనా సీఎం జగన్‌ తెలుసుకోవాలని దేవినేని సూచించారు.
 
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్‌లో పాల్గొంటున్న 15 మంది టీడీపీ కార్యకర్తలను ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌లపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఇందులోభాగంగా జిల్లా బస్సు స్టేషన్ వద్ద ఎంపీ రామ్మోహన్ నాయుడు ధర్నాకు దిగారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, పోలీసుల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది.