1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: సోమవారం, 6 మార్చి 2023 (12:27 IST)

అక్కడ గెలిచి గొప్పులు చెప్పడంకాదు.. అక్కడ పోటీ చేసి గెలవండి.. జగన్‌కు

nara lokesh
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. కంచుకోటల్లో గెలిచి గొప్పలు చెప్పడం కాదనీ, వైకాపాకు ఏమాత్రం బలంలేని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని ఆయన సవాల్ విసిరారు. తాను చేపట్టిన యువగళం యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా పీలేరులో సాగుతోంది. ఇక్కడ ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందంటూ పారిశ్రామికవేత్తలు చెప్పారని.. ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని వ్యాఖ్యానించారు. 
 
ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుని యువతను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని లోకేశ్‌ ఆరోపించారు. దావోస్‌ ఒప్పందాలను మళ్లీ విశాఖలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో చేసుకున్నట్లు చూపించారని ఆక్షేపించారు. విశాఖపట్నంలో జరిగింది గ్లోబల్‌ ఇన్వెసర్ల సమ్మిట్‌ కాదని.. లోకల్‌ ఫేక్‌ సమ్మిట్‌ అని ఆయన ఎద్దేవా చేశారు. 
 
వైకాపా పాలనలో పీపీఏలు రద్దు చేయడంతో పాటు రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారన్నారు. జగన్‌ సీఎం అయ్యాక బాగుపడింది భారతి సిమెంట్‌ పరిశ్రమ మాత్రమేనని ఆరోపించారు. తెదేపా పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదని.. వైకాపా గెలవని చోట పోటీ చేసి గెలిచే సత్తా జగన్‌కు ఉందా? అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. 
 
తెదేపాకు గతంలో ఏమాత్రం పట్టులేని మంగళగిరిలో గెలిచి కంచుకోటగా మారుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి చూపిస్తున్నానని.. మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ ముందు అయినా సెల్ఫీ దిగి చూపించగలరా? అని జగన్‌కు ఛాలెంజ్‌ విసిరితే ఆయన స్వీకరించలేదని చెప్పారు.