ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (10:52 IST)

మంగళగిరి కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పొలిట్‌బ్యూరో భేటీ...

tdp flag
తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో గురువారం జరుగుతుంది. మంగళగిరిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో నామినేటెడ్ పదవులు, శ్వేత పత్రాలు, సంస్థాగత వ్యవహారాల వంటి ఆరు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ పొలిట్ బ్యూరో సమావేశంలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చిస్తారని సమాచారం. 
 
ముఖ్యంగా, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పొలిట్ బ్యూరో సమావేశం కావడంతో అమిత ప్రాధాన్యత ఏర్పడింది. పొలిట్ బ్యూరో సమావేశం కోసం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. 
 
నిర్దేశిత షెడ్యూల్ వల్ల సీఎం సందర్శకులను కలిసే సమయం ఉండదని పార్టీ నేతలు వెల్లడించారు. అర్థం చేసుకుని సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం జరిగే ప్రజా వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ వినతి పత్రాలను అందించే వెసులుబాటును వినియోగించుకోవాలని కోరారు. పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే అవకాశం ఉండటంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.