సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 అక్టోబరు 2021 (13:02 IST)

తెదెపాను నిషేధించాలి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతిపక్ష నేత రాష్ట్ర బంద్ పిలుపునివ్వడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్నాయి. టీడీపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. ముఖ్యమంత్రిపై టిడిపి నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు వైయస్‌ఆర్‌సిపి నాయకుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇది టిడిపి కార్యాలయాలపై దాడులకు దారితీసిన విషయం తెలిసిందే.

 
ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, వైఎస్ఆర్‌సిపి-టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం బుధవారం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీని నిషేధించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీకి, టీడీపీకి తేడా లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అలాంటి భాషను ఉపయోగిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. 

 
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాజకీయ నాయకుడు ఇంత దూషణలో మాట్లాడటాన్ని తాను ఎన్నడూ చూడలేదని బొత్స అన్నారు. మరోవైపు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పట్టాభి చేసిన వ్యాఖ్యలను ఖండించనందుకు పవన్ కళ్యాణ్, సోము వీర్రాజుపై బొత్స విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.