శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (10:47 IST)

తెదేపా రాష్ట్ర బంద్ : దేవినేని ఈడ్చుకెళ్లి వ్యానులో కుక్కిన పోలీసులు

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపైనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై వైసిపి శ్రేణుల దాడికి నిరసనగా ఏపీ బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. దీంతో బుధవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అయితే,  వీరిని పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. ఇలా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. 
 
ఈ బంద్‌లో భాగంగా, కృష్ణా జిల్లా గొల్లపూడి సెంటర్‌లో నిరసన తెలియజేయడాని వచ్చిన మాజీమంత్రి దేవినేని ఉమను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. భారీగా మొహరించిన పోలీసులు ఉమ బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించారు. అయితే, పోలీసు వ్యాన్ ఎక్కకుండా దేవినేని ఉమ తీవ్రంగా ప్రతిఘటించారు. 
 
ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆటవిక, అరాచక పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజల స్వేచ్చనే కాదు ఇప్పుడు పార్టీల స్వేచ్చను కూడా జగన్ సర్కార్ హరిస్తోందన్నారు. పోలీసులు వైకాపాకి తొత్తులుగా మారిపోయారని ఉమ ఆరోపించారు.