శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:14 IST)

దాడులు జరుగుతున్నందుకేనా పోలీసులకు అవార్డులు?

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నేతలపై వైసీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆగ్రహం చేస్తోంది. తాజాగా టిడిపి మహిళా నాయకురాలు మాజీ జెడ్పిటిసి బత్తిని శారద ఇంటిపై వైసిపి అల్లరిమూకలు వీరంగం సృష్టిస్తే పోలీసులు ఏం చేశారో అర్థం కాలేదని, ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు ఇప్పుడు బాధితులను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
జగన్ సర్కార్ పై టీడీపీ విమర్శలు ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయని, ఏకంగా చంద్రబాబు ఇంటిపైనే వైసీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు అని, ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ గుండాల దాడులు, ప్రభుత్వ ప్రేరేపిత దాడులుగా తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దాడులు, విధ్వంసాలు పెరిగిపోయాయని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేకమార్లు ఏపీలో జరుగుతున్న దాడులపై గవర్నర్ కు సైతం ఫిర్యాదులు చేశారు. ఇక డీజీపీకి అనేక మార్లు ఫిర్యాదులు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలు రాశారు.దుశ్చర్యలకు ప్రతిఫలం అనుభవించక తప్పదని అచ్చెన్న హెచ్చరిక తాజా ఘటనపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.

టిడిపి నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఘోరాతిఘోరాలు జరుగుతూ ఉన్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, దాడులకు సహకరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తప్పుచేసిన వారు చంద్రమండలంలో దాక్కున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రానున్నది టిడిపి ప్రభుత్వమేనని అభిప్రాయపడ్డారు. అధికార మదంతో అకారణంగా తమరు చేస్తున్న దుశ్చర్యలకు ప్రతిఫలం అనుభవించక తప్పదని వైయస్ఆర్సిపి కార్యకర్తలకు, దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
 
వైసిపి పాలనలో రాష్ట్రం అబద్ధాలకు, అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. జగన్ పాలన వంచనకు చిరునామాగా మారిందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొప్పర్రు లో టిడిపి మహిళా నేత శారద ఇంటిపై దాడి చేసి ఆమె ఇల్లు, ఆరు బైకులు తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర వహించారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దాడులు జరుగుతున్నందుకేనా రాష్ట్ర పోలీసులకు అవార్డులు అంటూ నిలదీశారు. 24 గంటల్లో గా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం, టిడిపి మహిళా నాయకురాలు శారద ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో గా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టిడిపి మహిళా నాయకురాలు ఇంటిపై దాడి ఘటన సమయంలో పోలీసులు కూడా గాయపడ్డారని, పోలీసులు అల్లరి మూకలను ఆపలేకపోయారు అని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది అంటే ఇక సామాన్యులకు ఎవరు దిక్కు అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.