మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (16:16 IST)

సీతారాముల విగ్రహాల కళ్ళ నుంచి నీరు కారుతోంది... ఎక్కడ?

రామాలయంలో సీతారాముల విగ్రహాల కళ్ళ నుంచి నీరు కారుతుంది. ఈ వింత ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడులో చోటుచేసుకుంది. దీంతో జనం పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివస్తున్నారు. ఇది అరిష్టమని.. రెండేళ్ళుగా సీతారాముల కళ్యాణం నిర్వహించకపోవడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ సమాచారం చుట్టుపక్క గ్రామాలకు వ్యాపించడంతో జనం తాకిడి పెరిగింది. ఇది మానవ జాతికి రాబోతున్న ముప్పుకు సంకేతమని కొందరు అంటున్నారు.
 
అయితే కొద్ది రోజుల క్రితం చింతపండు రసంతో  విగ్రహాలకు ఉన్న ఇత్తడి కళ్ళు తుడవడం వల్ల ఇప్పుడు నీరు కారుతున్నాయేమో అంటూ ఆలయ పూజారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం సీతారాముల కళ్యాణం జరిపించకపోవడం వల్లే ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. సీతారాముల విగ్రహాల నుంచేకాక లక్ష్మణ, హనుమ విగ్రహాల నుంచి కూడా ఇలాగే నీరు కారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. 
 
తమ గ్రామానికి అరిష్టం జరగబోతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అరిష్టం జరగకుండా రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కోసం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.