మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (08:31 IST)

తెలంగాణాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు?!

సీబీఎస్ఈలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేసే దిశగా ఆలోచనలు చేస్తుంది. దీనిపై నేడు లేదా రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విద్యా శాఖ అధికారుల నుంచి స‌మాచారం అందుతోంది. 
 
జులై 15 తర్వాత ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంటున్నామని కేంద్రానికి ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ అభిప్రాయాన్ని తెలిపింది. అయితే గతంలో 10, 11వ తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించగానే.. మరుసటి రోజే తెలంగాణ స‌ర్కార్ కూడా టెన్త్, ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో విద్యకు సంబంధిత విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు గతేడాదే సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ పరీక్షలు రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో సుమారు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేశారు. సీబీఎస్ఈ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
 
ఇదిలావుంటే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర‌త నేప‌థ్యంలో వాయిదా పడిన సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇటీవల రాష్ట్రాల విద్యామంత్రులతో కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ జరిపిన సమావేశంలో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్ధుల ఆరోగ్యం, భద్రత ముఖ్యం అని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. గత ఏడాది లాగానే ఎవరైనా విద్యార్ధులు పరీక్షలను రాయాలని కోరుకుంటే కరోనా పరిస్ధితులు కుదుటపడిన తర్వాత వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.