శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (19:39 IST)

ఓటుకు నోటు: రేవంత్‌కు చుక్కెదురు.. ఏసీబీ పరిధిలోకి రాదని కొట్టివేత

2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చార్జీషీట్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన ఈ ఛార్జీషీట్‌లో రేవంత్‌ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఈడీ పేర్కొంది. ఛార్జీ‌షీట్‌లో రేవంత్‌తో పాటు వేంకృష్ణ కీర్తన్‌రెడ్డి, సెబాస్టియన్‌ల పాత్ర కూడా ఈడీ పేర్కొంది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు సంచలనం రేపింది. 
 
ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబుకు సంబంధించి ఆడియో టేపులు కూడా వైరల్ అయ్యాయి. ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.
 
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన ఈ ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. దీనిని కొట్టివేసింది. గతంలో ఏసీబీ కోర్ట్ కొట్టివేయ్యడంతో రేవంత్ హైకోర్టు‌ను ఆశ్రయించారు. అయితే, ఇప్పుడు హైకోర్టు  కూడా కొట్టివేసింది.
 
మరోవైపు ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు.. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌పై రేవంత్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 
 
రేవంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం.. ఆ కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది.